కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. కేవలం రెండు రోజుల ముందే వెన్యూ నిర్ణయం జరిగినప్పటికి ఆఘమేఘాల మీద జరిగిన ఏర్పాట్లలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా నిర్వహించారు. ఇదే చోట పుష్ప 1 ది రైజ్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన దర్శక ధీర రాజమౌళి ఈసారి పుష్ప 2 ది రూల్ కు ఛీఫ్ గెస్టుగా రావడం కాకతాళీయమో లేక అనుకున్న ప్రకారమో కానీ మొత్తానికి ప్రధాన ఆకర్షణలో ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా కొన్ని ముచ్చట్లు పంచుకున్నారు.
పుష్ప 1 టైంలో ప్రమోషన్లు చేసుకోమని నేనే చెప్పానని కానీ ఈ రోజు పుష్ప 2కి ప్రమోషన్లే అవసరం లేనంత గొప్ప స్థాయికి వెళ్లిపోయిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది నిజమే. పుష్ప 1కి సమయం లేని కారణంగా పబ్లిసిటీ మీద మైత్రి టీమ్ సరిగా ఫోకస్ చేయలేకపోయింది. కంటెంట్ ఉన్న బొమ్మకి ఇలా చేశారేంటనే ప్రశ్న జక్కన్న అప్పుడే సంధించారు. కట్ చేస్తే మూడేళ్ళ కాలంలో ఇంత మార్పు జరిగిపోయింది. పుష్ప 2 ఇంట్రో చూశానని, అద్భుతంగా వచ్చిందని, దాని గురించి ఇప్పుడు చెప్పనని సుకుమార్ కు హామీ ఇస్తూ దానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని ఊరించారు.
మాట్లాడింది కొన్ని నిమిషాలే అయినప్పటికీ రాజమౌళి స్పీచ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. సెంటిమెంట్ ఎలాగూ రిపీట్ అయ్యింది కాబట్టి పుష్ప 2 ది రూల్ ఫలితం కూడా మొదటి భాగానికి మించి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. గత కొంత కాలంగా జక్కన్న బయట ఈవెంట్లలో కనిపించడం లేదు. కానీ సుకుమార్ తో స్నేహం, బన్నీతో ఫ్రెండ్ షిప్ మళ్ళీ వచ్చేలా చేశాయి. హాలీవుడ్ రేంజ్ లో ప్రశంసలు దక్కించుకున్న రాజమౌళే ఈ స్థాయిలో పుష్ప 2 గురించి చెప్పారంటే బొమ్మ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ప్రపంచంలో ఉన్న తెలుగోళ్లందరూ టికెట్లు కొని ఉంటారని చెప్పి ఆల్ ది బెస్ట్ తో ముగించేశారు.