ఖలేజా సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు మహేష్ బాబు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినప్పటికీ.. అది తన కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమాగా మహేష్ భావిస్తూ నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు చెప్పాడు.
ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. అంతే కాక అతి త్వరలో త్రివిక్రమ్‌తో సినిమా ఉండబోతోందని కూడా సంకేతాలు ఇచ్చాడు. ఇదేదో మాట వరసకు అన్నట్లుగా ఏమీ లేదు. నిజంగానే త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలున్నాయన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట చిత్రాన్ని మొదలుపెట్టే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రాజమౌళి సినిమాకు మాత్రమే కమిట్మెంట్ ఇచ్చాడు. ఐతే అది పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది క్లారిటీ లేదు. రాజమౌళి అయితే వచ్చే ఏడాది చివరి వరకు ఖాళీ అవ్వడనే భావిస్తున్నారు. 2022లో ఈ సినిమా మొదలు కావచ్చేమో.
మహేష్ ఇంకో ఆరు నెలల్లోపే పరశురామ్ సినిమాను పూర్తి చేసి ఖాళీ అయిపోతాడు. తర్వాత రాజమౌళి సినిమా మొదలయ్యే లోపు ఒకటి.. కుదిరితే రెండు సినిమాలైనా చేసేయాలని అనుకుంటున్నాడు. త్రివిక్రమ్ ఇమ్మీడియట్ ప్రాజెక్టు అయితే ఎన్టీఆర్‌తో చేయాల్సినదే. కానీ అది మొదలవడానికి ఆలస్యమవుతుంది. ఆలోపు త్రివిక్రమ్ దాంతో పాటు మహేష్ చిత్రానికి కథ రెడీ చేసే అవకాశం లేకపోలేదు. అలా ఎన్టీఆర్ సినిమా పూర్తి చేసిన వెంటనే మహేష్ సినిమా మొదలుపెట్టడానికి అవకాశముంది.