‘క’తో మరోసారి పైరసీని భయపెట్టేసారు కదయ్యా…

థియేటర్లో కొత్తగా రిలీజైన సినిమాలే పైరసీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అలాంటిది ఓటిటిలో హెచ్డి ప్రింట్లు వచ్చాక ఆగుతాయా. ఎంత సాంకేతికత వాడినా దీన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో చాలా సందర్భాల్లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు పలు చర్యలు తీసుకున్నా ఫలితం అందుకోలేకపోయాయి. కానీ పక్కా తెలుగు యాప్ ఈటీవీ విన్ దగ్గర ఏదైనా మంత్రం ఉందో ఏమో కానీ పైరసీ భూతాన్ని టెక్నాలజీ సాయంతో కంట్రోల్ చేయడంలో బాగానే విజయం సాధిస్తోంది. గత నెల దీపావళికి విడుదలైన ‘క’ నిన్న అర్ధరాత్రి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆశ్చర్యకరంగా క’ ఎక్కడ పైరసీ బారిన పడకుండా సదరు ఓటిటిలో మాత్రమే అందుబాటులోకి రావడం విశేషం. కేవలం టీవీ, మొబైల్ ద్వారా చూసే వెసులుబాటు ఇవ్వడం ద్వారా కట్టడి చేయడానికి అవకాశం దొరికిందని టెకీ టాక్. డెస్క్ టాప్, లాప్ టాప్ ఆప్షన్ లేకుండా చేయడం వల్ల సాధ్యమయ్యిందని అంటున్నారు. ఇదే సమయానికి నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లక్కీ భాస్కర్ పైరసీ బ్యాచుకు దొరికిపోవడం ట్విస్టు. విన్ యాప్ లో గతంలో వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రకు ఇదే తరహాలో పైరసీని ఆపగలిగారు. నటుడు నరేష్ పైరసీ చేసుకోమని ఛాలెంజ్ విసరడం హాట్ టాపిక్ అయ్యింది. 90స్ వెబ్ సిరీస్ ని అనఫీషియల్ గా చూసిన వాళ్లే ఎక్కువగా ఉండటం ఈటీవీ టీమ్ ని కొత్త పరిష్కారం వైపు నడిపించింది.

ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇలా మెల్లగా పైరసీ నియంత్రణకు రకరకాల మార్గాలు వెతకడం ద్వారా థియేటర్ తో పాటు డిజిటల్ లోనూ సినిమాను బ్రతికించేందుకు అవకాశం దొరుకుతుంది.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన క’ ఓటిటి హక్కులు థియేటర్ విడుదలకు ముందు అమ్ముడుపోలేదు. నిర్మాత ఆశించిన మొత్తానికి కంపెనీలు కోట్ చేసిన సొమ్ముకు వ్యత్యాసం ఉండటంతో నిర్ణయం తీసుకోలేదు. తీరా రిలీజయ్యాక బ్లాక్ బస్టర్ ఫలితం దక్కడంతో ఈటివి పోటీపడి హక్కులు సొంతం చేసుకుంది. పది కోట్ల దాకా ఆఫర్ చేశారనే టాక్ ఉంది కానీ నిర్ధారణగా ఎంత మొత్తమనేది అధికారికంగా బయటికి రాలేదు. ఓటిటిని విస్తరించుకునే పనిలో ఉన్న ఈటీవీ విన్ కి క’ ఒకరకంగా జాక్ పాట్ లాంటిది. ఈ సినిమా కోసమైనా చేరే చందాదారులు ఖచ్చితంగా ఉంటారు. ఆదాయం పెరిగేది కూడా వాళ్ళ వల్లే.