విశ్వక్ సేన్ లెక్క ఎక్కడ తప్పిందంటే…

ప్రమోషన్ల విషయంలో ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉండే విశ్వక్ సేన్ మెకానిక్ రాకీకి అదే చేశాడు కానీ కాస్త టోన్ తగ్గింది కంటెంట్ మీద నమ్మకాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేయడం అంచనాలు రేపింది. ట్రీట్లు, ఇంటర్వ్యూలు, విజిట్లు గట్రా గట్టిగా చేశాడు. అయితే ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. సెకండాఫ్ అదిరిపోయింది, ట్విస్టులు మతిపోగొడతాయని పదే పదే చెప్పారు కానీ మరీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అవి లేకపోవడం బాక్సాఫీస్ రిజల్ట్ మీద ప్రభావం చూపించింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటుందని విడుదలకు ముందు విశ్వక్ పదే పదే చెప్పుకోవడమూ మైనస్ అయ్యింది.

గ్యాంగ్స్ అఫ్ గోదావరికి వచ్చిన ఓపెనింగ్ మెకానిక్ రాకీకి కొనసాగి ఉంటే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఆశ్చర్యకరంగా గామి టైంలో ఏర్పడిన బజ్ సైతం కనిపించలేదు. దాస్ కా ధమ్కీ, ఓరి దేవుడాలు మొదటి వారం టాక్ తో సంబంధం లేకుండా మాస్ అండతో చక్కగా హోల్డ్ చేశాయి. అశోకవనంలో అర్జున కళ్యాణం ఫ్యామిలీ జనాలను తీసుకొచ్చింది. కానీ మెకానిక్ రాకీకి ఇవేవి కలిసి రాలేదు. అనూహ్యంగా సత్యదేవ్ జీబ్రా పికప్ కావడం అసలు ట్విస్టు. రేటింగ్స్, రివ్యూలలో జీబ్రా వెనుకబడినప్పటికీ ఆదివారం నుంచి పుంజుకుని డీసెంట్ రన్ వైపు పరుగులు పెట్టింది. కానీ విశ్వక్ సినిమాకు అలా జరగలేదు.

విశ్వక్ లెక్క ఎక్కడ తప్పిందో కారణాలు స్పష్టం. కేవలం ట్విస్టుల మీద ఆధారపడి సగం సినిమాను తేలికగా నడిపిస్తే ఆడియన్స్ అంగీకరించరు. టయర్ 1 హీరోలకు మాత్రమే ఆ మినహాయింపు ఉంటుంది. ఒకవేళ మెకానిక్ రాకీ ఫస్ట్ హాఫ్ ని సైతం ఎంగేజింగ్ గా నడిపించి ఉంటే టాక్ ఇంకొంత మెరుగ్గా ఉండేదన్న మాట వాస్తవం. ఎలాంటి పోటీ లేని టైంలో కంటెంట్ కనక సరిగ్గా ఉంటే పుష్ప 2 వచ్చేదాకా థియేట్రికల్ రన్ దక్కేది. కానీ విశ్వక్ సేన్ అది మిస్ చేసుకున్నాడు. కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ గా నిలుస్తుందనే ట్రేడ్ అంచనా నిజం కాకూడదనే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక నెరవేరితే మంచిదే.