చిరు, బాలయ్య మధ్య తేడా చెప్పిన బాబీ

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరితోనూ సినిమాలు చేసిన యువ దర్శకుడు బాబీ కొల్లి. రెండేళ్ల కిందట సంక్రాంతికి వచ్చిన చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’కు అతనే దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ అయింది. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని బాలయ్యతో ‘డాకు మహారాజ్’ చేశాడు. ఆ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

ఇద్దరు సీనియర్ టాప్ హీరోలతో ఓ యువ దర్శకుడు వరుసగా సినిమాలు చేయడం విశేషమే. ‘డాకు మహారాజ్’ కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాబీ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో దర్శకుడితో వ్యవహరించే తీరులో చిరు, బాలయ్యల మధ్య తేడా ఏంటో బాబీ వివరించాడు.

“చిరంజీవి గారు, బాలయ్య గారు దర్శకులతో వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. చిరంజీవి గారు అన్ని విషయాలూ పట్టించుకుంటారు. స్క్రిప్టు పూర్తిగా చెప్పాలి. ప్రతి డైలాగ్‌కు సంబంధించి పేపర్ ముందే ఆయనకు ఇవ్వాలి. అన్నీ వివరంగా తెలుసుకుంటారు. కానీ బాలయ్య అలా కాదు. ఒకసారి కథ ఓకే చేశాక ఆయన దర్శకుడిని గుడ్డిగా నమ్ముతారు. ఇంకేదీ పట్టించుకోరు. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుపోతారు. ఇదెందుకు, అదెందుకు అని అస్సలు అడగరు. దర్శకుడు తన కంటే తెలివైన వాడని ఆయన నమ్ముతారు. కాబట్టి మనం ఏం అడిగితే అది చేస్తారు. ఇది వారి నాన్న గారి నుంచి నేర్చుకున్న విషయం కావచ్చు. హీరో ఇలా ఉంటే మన మీద ఇంకా బాధ్యత పెరుగుతుంది. మనల్ని ఇంతగా నమ్ముతున్నపుడు మామూలుగా ఏదో చేస్తే కుదరదు. చాలా స్పెషల్‌గా చేయాలి అని ఫీలింగ్ వస్తుంది” అని బాబీ చెప్పాడు.

ఐతే బాబీ చెప్పినట్లు చిరు, బాలయ్యల పనితీరులో వ్యత్యాసం ఉంటుంది. అలా అని ఎవరి శైలి బెస్ట్ అనేది చెప్పలేం. సినిమాకు సంబంధించి హీరో అన్ని విషయాలనూ పట్టించుకోవడమూ అవసరమే. అలాగే దర్శకుడికి స్వేచ్ఛ ఇవ్వడమూ ముఖ్యమే.