మొన్న కంగనాకు.. ఇప్పుడు ఆయనకు

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఒక సామెత. ఐతే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే సెక్యూరిటీకి కొదవా అన్న మాట వినిపిస్తోంది. తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే, పనికొస్తారని భావించే ప్రముఖులకు భాజపా పాలిత ప్రభుత్వాలు భారీ భద్రత కల్పిస్తున్న ఉదంతాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్‌‌పై ఎర్రజెండా ఎగురవేసి, కొంతమేర భారతీయ జనతా పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్న నరసాపురం ఎంపీ రఘురామరాజు.. తనకు వైకాపా వాళ్ల నుంచి హాని ఉందంటూ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తే ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ కాని ఎంపీకి ఈ స్థాయిలో కేంద్రం భద్రత కల్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాకపోతే సెక్యూరిటీ ఖర్చంతా కూడా ఆయనే పెట్టుకుంటున్నారు మరి.

రఘురామకృష్ణంరాజు సంగతి పక్కన పెడితే.. ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు సైతం వై కేటగిరీ భద్రత కల్పించడం.. సంబంధిత ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు వార్తలు రావడం సంచలనం రేపింది. మహారాష్ట్రలో అధికార పార్టీ అయిన శివసేనను గట్టిగా ఢీకొడుతున్న కంగనా.. ఆ పార్టీ కార్యకర్తల నుంచి తనకు ముప్పుందని కేంద్రానికి విన్నవించడంతో ఆమెకు ఆ స్థాయిలో భద్రత కల్పించారు.

ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ప్రముఖుడు వచ్చాడు. భోజ్‌పురి సినిమాల్లో సూపర్ స్టార్‌ అయి.. తెలుగులో ‘రేసుగుర్రం’ సహా ఎన్నో భారీ చిత్రాల్లో నటించిన రవికిషన్ కు తాజాగా వై ప్లస్ కేటగిరీ.. అంటే రఘురామకృష్ణంరాజు, కంగనాల కంటే ఎక్కువ స్థాయిలో భద్రత కల్పిస్తూ ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా సర్కారు నిర్ణయం తీసుకుంది.

రవికిషన్ ఈమధ్య పార్లమెంట్లో బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందని, యువత తప్పు దోవ పడుతోందని.. నటులకు డ్రగ్స్ రాకెట్ తో ఉన్న సంబంధాలు బయటపెట్టేలా సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల విషయమై తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనను సినిమాల నుంచి కూడా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రవికిషన్ ఆందోళన వ్యక్తం చేశాడు. బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆయన యూపీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించమని లేఖ రాశారు. స్పందించిన సీఎం యోగి ఆయనకు ‘Y+’ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.