టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ కేసు పెట్టడంతో ఆయన అరెస్టు అయ్యారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు వచ్చిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే, అప్పటినుంచి జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా ఆయనకు కోర్టు నుంచి నిరాశ ఎదురవుతూ వస్తుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ ఈరోజు బెయిలుపై విడుదల కాబోతున్నారు.
కాగా, తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవకాశాల కోసం జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన సమయంలో తనపై ఆయన లైంగిక వేధింపులకు దిగారని ఆరోపించింది. బాధిత యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడి జరుగుతున్న నేపథ్యంలో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన ఎన్నికల ప్రచారంలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.