30 కోట్లు ఖర్చుపెట్టాక ఆపేసిన మల్టీస్టారర్

బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న మల్టీ స్టారర్ ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ గురించిన వార్తలు గత రెండు మూడు వారాలుగా గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. 2019లో వచ్చిన ఉరి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు ఆదిత్య ధార్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మీదే అయిదేళ్ళుగా పని చేస్తున్నాడు. దీని ముందు వెనుకా చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. ఇది ప్రకటించినప్పుడు హీరో హీరోయిన్లుగా విక్కీ కౌశల్, సారా అలీఖాన్లను తీసుకున్నారు. కానీ కరోనా టైంలో ఆపేయాల్సి వచ్చింది. కొంతకాలం అయ్యాక సారా కన్నా సమంతా మంచి ఛాయస్ అనిపించి తనను సంప్రదించారు.

ఈలోగా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాత రోనీ స్క్రూవాలా దీన్నుంచి తప్పుకున్నారు. ఆదిత్య ధార్ చాలా మంది నిర్మాతలను కలిసి ఎట్టకేలకు జియో సంస్థ కోసం ముఖేష్ అంబానీ టీమ్ ని ఒప్పించాడు. అయితే విక్కీ కౌశల్ కు అంత మార్కెట్ లేదని గుర్తించిన జియో అతన్ని మార్చాలని నిర్ణయించుకుంది. ఇది ఎంతకీ తేలకపోవడంతో సామ్ తప్పుకుంది. స్టార్ వేల్యూ కావాలనే ఉద్దేశంతో ఆదిత్య కెజిఎఫ్ యష్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ లను సంప్రదించాడు. అయితే ఇద్దరూ అంత సుముఖంగా లేరట.

సరే రన్వీర్ సింగ్ ని ప్రయత్నిద్దామని ఒక రాయి వేశారు. కానీ అప్పటికే అతను ఇలాంటి సూపర్ హీరో సబ్జెక్టుతో శక్తిమాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. దీంతో నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఇలా పలు దఫాల చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం పెట్టిన ఖర్చు అక్షరాలా 30 కోట్లకు పైమాటే. సినిమాకు కావాల్సిన బడ్జెట్ 350 కోట్లు. రిస్క్ చేసి మొత్తం పోగొట్టుకోవడం కన్నా పది శాతం నష్టంతో గట్టెక్కడం మంచిదనే ఆలోచనతో ఇప్పుడు జియో కూడా దాదాపు డ్రాప్ అయినట్టేనట. ఆదిత్య ధార్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఇంకా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు