యడ్డీకి షాకిచ్చిన మోడి

కర్నాటకలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్ద షాకిచ్చారు. రాజీనామాకు ముందు యడ్యూరప్ప డిమాండ్లను అంగీకరించిన కేంద్ర నాయకత్వం తర్వాత తుంగలో తొక్కేసింది. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన కొత్తమంత్రివర్గంలో యడ్డీ కొడుకు విజయేంద్రకు చోటు దక్కలేదు. అలాగే మాజీ సీఎం మద్దతుదారుల్లో చాలామందికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. అలాగే ఉపముఖ్యమంత్రులుగా ఎవరినీ నియమించలేదు.

కొద్దిరోజుల ముందు తన భవిష్యత్తుపై మాట్లాడేందుకు యడ్యూరప్ప ఢిల్లీలో నరేంద్రమోడి, అమిత్ షా తో భేటీ అయ్యారు. తాను రాజీనామా చేయటానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పిన యడ్డీ కొన్ని డిమాండ్లు చేశారని సమాచారం. తన కొడుకు విజయేంద్రకు మంత్రివర్గంలో చోటు, తన మద్దతుదారుల్లో కొందరిని మంత్రులను చేయటమే కాకుండా అందులో కొందరిని ఉపముఖ్యమంత్రులుగా నియమించాలని డిమాండ్ చేశారట. అంతేకాకుండా తన మద్దతుదారుల జాబితాను కూడా మోడికి అందించారట.

అప్పట్లో యడ్డీ డిమాండ్లపై సానుకూలంగా స్పందించటంతో వెంటనే ఆయన రాజీనామా చేసేశారు. అయితే యడ్డీ వారుసునిగా బసవరాజ్ బొమ్మైనే నియమించిన మోడి, అమిత్ లు మంత్రివర్గం కూర్పులో బొమ్మైకి పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు అర్ధమైపోతోంది. మరో మూడేళ్ళల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలున్న కారణంగా కాస్త క్లీన్ చిట్ ఉన్నవారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కొత్త సీఎం సూచనలను ఆమోదించారు. దాని ప్రకారం బొమ్మై సిద్దం చేసిన జాబితానే దాదాపు ఆమోదించినట్లు సమాచారం.

ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ ఉండకూడదన్న బొమ్మై సూచనకు మోడి సానుకూలంగా స్పందించినట్లే ఉంది. అందుకనే మంత్రుల్లో చాలామంది కొత్తవాళ్ళని ఎంపికచేశారు. అలాగే యడ్డీ మద్దతుదరులుగా ముద్రపడిన వారిలో చాలామందిని దూరంపెట్టేశారు. అంతేకాకుండా అసలు ఉపముఖ్యమంత్రుల పదవే లేకుండా చేసేశారు. తాజా మంత్రివర్గం కూర్పుని చూసిన తర్వాత యడ్డీకి ఏమి మాట్లాడాలో అర్ధంకానంతగా షాక్ తగిలింది.

తన రాజకీయ వారసునిగా విజయేంద్రకు మంత్రిపదవిని ఇప్పించుకోలేని స్ధితిలో యడ్యూరప్ప మిగిలిపోయారు. మరి ఇప్పటికైతే యడ్డీని దూరంపెట్టడంతో షాక్ ఇచ్చినా ముందు ముందు ఆయన ఏమి చేస్తారనే విషయమే ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే తన డిమాండ్లు నెరవేరకపోతే ఊరకుండే రకంకాదు యడ్డీ. కాబట్టి ముందు ముందు కర్నాటక రాజకీయం రసవత్తరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.