గేట్స్ లీలలపై మైక్రోసాఫ్ట్ ప్రైవేటు విచారణ


బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వైనం ఎంతటి సంచలనానికి తెర తీసిందో తెలిసిందే. వీరి విడాకుల ఉదంతం బయటకు వచ్చిన నాటి నుంచి బిల్ గేట్స్ కు సంబంధించి బోలెడన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని అచ్చేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించింది.

తమ కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగినితో బిల్ గేట్స్ సన్నిహితంగా మెలిగినట్లుగా పేర్కొంది. దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా కంపెనీ ముందుకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న బిల్ గేట్స్ మీద వచ్చిన ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ రహస్యంగా విచారణ జరపటమే కాదు.. అందుకు బయట నుంచి ఒక ఏజెన్సీ సాయాన్ని కూడా తీసుకున్న వైనం తాజాగా బయటకు వచ్చింది.

అయితే.. దీనికి సంబంధించిన విచారణ ఒక కొలిక్కి రాక ముందే బిల్ గేట్స్ కంపెనీ నుంచి తప్పుకోవటం గమనార్హం. సామాజిక సేవా కార్యక్రమాలకోసం మరింత సమయాన్ని వెచ్చించాలన్న ఉద్దేశంతో గత ఏడాది మార్చిలో ఆయన ప్రకటించటం తెలిసిందే. అయితే.. బోర్డు నుంచి తప్పుకోవాలన్న ఆయన నిర్ణయానికి మహిళా ఉద్యోగితో ఆయనకున్న సన్నిహిత సంబంధానికి లింకు లేదని చెబుతున్నారు. ఇరవై ఏళ్ల క్రితమే వీరి వ్యవహారం సానుకూలంగా ముగిసినట్లు చెబుతున్నారు. ఏమైనా.. తమ కంపెనీ సహ వ్యవస్థాపకుడి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అంతర్గతంగా విచారణ జరిపిందన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో మరెన్ని అంశాలు తెర మీదకు రానున్నాయో చూడాలి.