రేవంత్ ను ఆ శ్రీరాముడే కాపాడాలి

తెరవెనుక బీజేపీ ఏం చేస్తుంది ? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏఏ రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలుస్తుంది ? తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తుంది ? అన్నది ఎంత వరకు నిజమో కానీ రాజకీయ నాయకులు, మీడియా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఏదో జరగబోతుంది అన్న ప్రచారం సాగుతున్నది.

దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే అధికారంలో ఉన్నది. ఇటీవల రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో అధికారాన్ని కోల్పోయింది. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలను పడగొడుతుందని ఉహాగానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. బీజేపీ నేతల ప్రసంగాలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అందుకే రేవంత్ మోడీని భడే బాయ్ అంటూ రాజీకి వస్తున్నాడని అంటున్నారు.

తాజాగా బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో బీజేపీ గనక 12 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తే రేవంత్ రెడడి ముఖ్యమంత్రి కుర్చీని ఇక ఆ శ్రీరాముడే కాపాడాలని, అసలు ఆయన ఆగస్ట్ వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడో ? ఉండడో ? కూడా తెలియదని’’ అన్నాడు. ఆగస్టులో రుణమాఫీ, డిసెంబరులో చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తా, ఆరు గ్యారంటీలు అమలుచేస్తా అని రేవంత్ అంటున్నాడని, అసలు ఆయన అధికారంలో ఉంటాడా ? అని అరవింద్ ఎద్దేవా చేశాడు. మరి లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుందో వేచిచూడాలి.