టీమిండియా ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన రవీంద్ర జడేజా ఇంటి పంచాయితీ రచ్చకు ఎక్కుతోంది. మధ్యతరగతికి చెందిన రవీంద్ర కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదగటం.. అతడి పెళ్లి సంపన్నురాలైన రివాబానేతో జరగటం.. ఆ తర్వాత నుంచి కుటుంబంలో సమస్యలు షురూ కావటం తెలిసిందే. తాజాగా రవీంద్ర జడేజా తండ్రి ఒక మీడియాసంస్థతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు షాకిచ్చేలా మారాయి.
తమ ఇంట్లోని గొడవలకు తమ కోడలే కారణమని రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింహ్ జడేజా వ్యాఖ్యలు చేవారు. జడ్డూతో ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేవన్న ఆయన.. ఇలాంటి పరిస్థితికి కారణం తమ కోడలేనని పేర్కొన్నారు. రవీంద్ర జడేజా సతీమణి 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం తెలిసిందే. ఆమె బీజేపీలో ఉన్నారు.
తన కొడుకును క్రికెటర్ గా తయారు చేసేందుకు తానెంతో కష్టపడినట్లుగా పేర్కొన్న రవీంద్ర తండ్రి.. “జడేజా భార్య రివాబా ఏం మాయ చేసిందో కానీ పెళ్లైన రెండు మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి. మేమంతా జామ్ నగర్ లో ఉంటున్నా వారు మమ్మల్ని పిలవరు. నేను కూడా వాళ్లను పిలవను. ఆస్తులన్నీ ఆమె పేరు మీదే రాయించుకుంది. ఆమె సోదరులదే రాజ్యమంతా. నా కొడుకును క్రికెటర్ ను చేసేందుకు ఎంతో కష్టపడ్డా. భుజాన 20 లీటర్ల పాల క్యాన్లను మోసుకుంటూ డబ్బులు సంపాదించా” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రవీంద్ర సోదరి సైతం అతడి కోసం చాలా కష్టపడిందన్న తండ్రి.. “అతడి చెల్లెలు తల్లిలా సేవలు అందించింది. ఆమెతోనూ జడేజాకు సంబంధాలు లేవు. ఐదేళ్లుగా మా మనమరాలిని కూడా చూడలేదు. అసలు అతడు క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంటుంది” అంటూ పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఇష్యూ మీద రవీంద్ర జడేజా మండిపడ్డారు. తన భార్యపై తన తండ్రి అనవసరమైన నిందలు మోపుతున్నారని పేర్కొన్నారు.
ఆమె గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు తగవన్న రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో రియాక్టు అయ్యారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలు.. ఆరోపణలు అబద్ధాలని.. అవన్నీ ఏకపక్ష వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. తాను చెప్పాలనుకుంటే చాలానే చెప్పగలనని పేర్కొన్నారు. కానీ.. ఆ విషయాల్ని తాను ఓపెన్ గా చెప్పనన్న రవీంద్ర.. ‘నా భార్య వ్యక్తిత్వాన్ని కించపర్చటాన్ని నేను ఏ మాత్రం సహించలేను’ అని పేర్కొన్నారు. మొత్తంగా రవీంద్ర జడేజా ఇంటి ఇష్యూలు ఇప్పుడు అందరిలోనూ చర్చకు కారణమవుతున్నాయని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates