ఆన్‌లైన్ షాపింగ్‌లో చెత్త ట్రెండ్… దాండియా తరువాత రిటర్న్!

ఆన్‌లైన్‌లో బట్టలు ఆర్డర్ చేసి నచ్చకపోతే రిటర్న్ చేయడం రెగ్యులర్ గా జరిగేదే. కానీ కొందరు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నవరాత్రి వేడుకల కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి, వాటిని వేసుకున్న తర్వాత తిరిగి పంపిస్తున్న వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోలో పెద్ద సంఖ్యలో రిటర్న్ పార్సిళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో బట్టలు అమ్మే చిన్న వ్యాపారులకు ఇబ్బందులు తప్పట్లేదు.

నవరాత్రి సమయంలో దాండియా, గర్బా వేడుకలకు స్పెషల్ ట్రెడిషన్ దుస్తులు ధరిస్తుంటారు. ఈ వేడుకల కోసం చాలామంది ఆన్‌లైన్‌లో డ్రెస్సులు కొనుగోలు చేస్తారు. అయితే పండుగ ముగిసిన తర్వాత వాటిని రిటర్న్ చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఓ వీడియోను షేర్ చేశారు. అందులో వరుసగా పేర్చిన పార్సిళ్లు కనిపిస్తున్నాయి.

వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి రిటర్న్స్‌పై విమర్శలు చేస్తున్నారు. వేడుకలకు దుస్తులు కావాలంటే అద్దెకు తీసుకోవచ్చని, కొనుగోలు చేసి ఉపయోగించిన తర్వాత వెనక్కి పంపడం సరైన పద్ధతి కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్ల ఆన్‌లైన్ సంస్థలు రిటర్న్ నిబంధనలను కఠినతరం చేసే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. అప్పుడు నిజంగా వస్తువు నచ్చక తిరిగి ఇచ్చే కస్టమర్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇలాంటి రిటర్న్స్ వల్ల ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి పంపిన దుస్తులను తిరిగి తెప్పించుకోవడానికి రవాణా ఖర్చులు భరించాలి. వాడిన దుస్తులైతే శుభ్రం చేయించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాటిని మళ్లీ కొత్తవిగా అమ్మడం కూడా సాధ్యం కాదు.

దీంతో అమ్మకం జరగకపోగా అదనపు ఖర్చుల వలన నష్టాలు తప్పవు. సైజు సరిపోకపోయినా, నాణ్యత బాగాలేకపోయినా వస్తువులను తిరిగి ఇచ్చేందుకు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే పండుగలకు ఉపయోగించిన దుస్తులను కూడా రిటర్న్ చేస్తున్నారనే ఆరోపణలతో ఈ సదుపాయం దుర్వినియోగంపై విమర్శలు వస్తున్నాయి.