సీబీఐకి సాయికృష్ణ కేసు: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్ట‌రీ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు అప్ప‌గిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. సంబంధిత కేసు రికార్డులు, సాక్ష్యాలు.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ద‌ర్యాప్తు వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ల‌ను త‌క్ష‌ణ‌మే సీబీఐకి బ‌దిలీ చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఇదేస‌మ‌యంలో సీబీఐ అధికారులు సైతం.. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా త‌క్ష‌ణే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశిం చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు..

కృష్ణ‌లంక‌కు చెందిన సాయికృష్ణ‌పై ప‌లు కేసులు ఉన్నాయి. అయితే.. అత‌ను త‌ప్పించుకుని తిరుగుతున్న క్ర‌మంలో వారెంటు మేర‌కు క‌ర్నూలులో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణ‌లంక పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఏడాది మేలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అనంత‌రం.. అత‌ను క‌నిపించ‌డం లేదంటూ.. సాయికృష్ణ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి పోలీసుల‌ను త‌ర్వాత‌.. హైకోర్టును ఆశ్ర‌యించారు. క‌నీసం మా అబ్బాయి బూడిదైనా అప్ప‌గిస్తే.. అంటూ విజ‌య‌ల‌క్ష్మి క‌న్నీరు పెట్టుకున్న ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది.

క‌ట్ చేస్తే.. సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంపై స్పందించి త‌క్ష‌ణ‌మే ఎస్పీ స్థాయి అధికారితో విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ ద‌ర్యాప్తులో భాగంగా సాయికృష్ణ‌ను పోలీసులు కొట్టి చంపేశార‌ని అధికారులు చార్జిషీట్ న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ నాగ‌రాజును అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి జైల్లో ఉన్నాడు. ఇక‌, ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న‌ట్టు భావిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌, నాగ‌రాజు స్నేహితుడు స‌తీష్‌ల‌ను కూడా ద‌ర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.

అయితే.. ఈ కేసు విచార‌ణ‌పై పురోగ‌తి క‌నిపించ‌డం లేద‌ని.. రాష్ట్ర పోలీసుల వ్య‌వ‌హారంపై త‌మ‌కు అనుమానాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ.. విజ‌య‌ల‌క్ష్మి సోద‌రి, న్యాయ‌వాది హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీ ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి కూడా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో తాజాగా హైకోర్టు ఈ కేసును సీబీఐకి బ‌దిలీ చేస్తూ.. కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఎప్ప‌టిలోగా విచార‌ణ పూర్తి చేయాల‌న్న అంశంపై ఎలాంటి గ‌డువు విధించ‌లేదు.