సరదాగా ఆడే ఆన్లైన్ గేమ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్లైన్ గేమ్‌లో మంచి ఐడీ ఇప్పిస్తామని చెప్పి ఓ బాలుడి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. మొదట రూ.6 వేలతో మొదలైన వ్యవహారం చివరకు రూ.4.11 లక్షలకు చేరింది. డబ్బుల కోసం కొందరు యువకులు పదేపదే బెదిరించడంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు.
కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా పాండోమట్టి గ్రామానికి చెందిన టి.ఆర్.మనోజ్‌కు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే అలవాటు ఉంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు పరిచయస్తులు గేమ్‌లో మంచి ఐడీ ఇప్పిస్తామని నమ్మించారు. అందుకోసం మొదట రూ.6 వేలు తీసుకున్నారు. ఆ తర్వాత ఐడీ అన్‌లాక్ చేయాలని, గేమ్‌లో మరిన్ని సౌకర్యాలు పొందాలని చెబుతూ డబ్బులు అడగడం మొదలుపెట్టినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
డబ్బులు ఇవ్వకపోతే గేమ్ ఆడుతున్న విషయం ఇంట్లో చెబుతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బాలుడిపై దాడి చేశారని కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో మనోజ్ ఇంట్లో ఉన్న డబ్బులను విడతలవారీగా తీసుకెళ్లి వారికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా మొత్తం రూ.4.11 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు.
ఇంట్లో డబ్బులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అప్పుడే మనోజ్ ఎదుర్కొంటున్న బెదిరింపుల విషయం బయటపడింది. ఈ వ్యవహారం తెలిసిన తర్వాత బాలుడు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్టోబర్ 7న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో చెన్నగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక బాలుర పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ మరణానికి దారితీసిన పరిస్థితులను ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates