H-1B ఉద్యోగి కోసం అదనపు ఫీజా… అమెరికా ప్లాన్ ఏంటి?

అమెరికాలో H-1B వీసాపై విదేశీ ఉద్యోగిని తీసుకోవాలంటే కంపెనీలు భారీగా అదనపు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రతి H-1B పిటిషన్‌కు 1,03,265 డాలర్లు అదనంగా వసూలు చేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. అయితే ఇది ఇంకా అమల్లోకి వచ్చిన రూల్ కాదు. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. ఫైనల్ అయితేనే కంపెనీలు ఈ కొత్త మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.

ఈ ఫీజు ప్రతి H-1B ఉద్యోగికి వర్తించదు. ప్రతి ఏడాది రెగ్యులర్ కోటాలో 65 వేల H-1B వీసాలు ఇస్తారు. అమెరికాలో మాస్టర్స్ లేదా అంతకంటే పై చదువులు పూర్తి చేసిన వారికి మరో 20 వేల ప్రత్యేక కోటా ఉంటుంది. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన పిటిషన్లపైనే కొత్త ఫీజు పెట్టాలని ప్రతిపాదించారు. అంటే ఏడాదికి గరిష్ఠంగా 85 వేల పిటిషన్లు ఈ రూల్ పరిధిలోకి రావచ్చు.

యూనివర్సిటీలు, కొన్ని పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థల ద్వారా వచ్చే H-1B పిటిషన్లకు మాత్రం ఈ ఫీజు వర్తించదు. మరి ఒక్క పిటిషన్‌కే లక్ష డాలర్లకు పైగా ఎందుకు వసూలు చేయాలనుకుంటున్నారు అంటే, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ నిర్వహణకు అయ్యే ఖర్చుల్లో కొంత భాగాన్ని కంపెనీల నుంచే తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. 

వీసా దరఖాస్తుల పరిశీలన, నకిలీ పత్రాలు గుర్తించడం, భద్రతా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ కోర్టులు, కార్మిక చట్టాల అమలు వంటి ఖర్చులను ఈ డబ్బుతో భర్తీ చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. 85 వేల పిటిషన్ల నుంచి ఏడాదికి దాదాపు 8.8 బిలియన్ డాలర్లు రావచ్చని లెక్క వేసింది.

ఇప్పటికే H-1Bపై మరో 100,000 డాలర్ల పేమెంట్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. 2025లో తీసుకొచ్చిన ఆ నిబంధన అమలును 2026 జూన్‌లో ఫెడరల్ కోర్టు నిలిపివేయగా, ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఇప్పుడు ప్రతిపాదించిన 103,265 డాలర్ల ఫీజు దానికి వేరే. రెండు ఒకేసారి అమల్లో ఉంటే కొన్ని H-1B పిటిషన్ల విషయంలో కంపెనీ ఖర్చు 2 లక్షల డాలర్లను దాటే అవకాశం కూడా ఉంది.

ఈ ప్రతిపాదన భారతీయులపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో ఆమోదం పొందే H-1B పిటిషన్లలో భారతీయుల వాటా చాలా ఎక్కువ. ఆమోదం పొందిన H-1B పిటిషన్లలో 71 శాతం భారత్‌వే ఉన్నాయి. కొత్త ఫీజు అమల్లోకి వస్తే ఉద్యోగి నేరుగా డబ్బు కట్టాల్సిన అవసరం లేకపోయినా, భారతీయ ఉద్యోగిని స్పాన్సర్ చేయాలనుకునే కంపెనీకి ఖర్చు భారీగా పెరుగుతుంది. ఈ ప్రతిపాదనపై ప్రజలు సెప్టెంబర్ 24 వరకు అభిప్రాయాలు చెప్పవచ్చు.