ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్న సమయంలో రాణా మెల్లగా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. అయితే నూర్ అహ్మద్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత బయటకు వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి అసలు కారణంగా మారింది.
అసలు గొడవ ఏంటంటే.. క్యాచ్ పట్టడానికి ముందే వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో అసలు అది అవుటా కాదా? ఒకవేళ బెయిల్స్ పడిపోతే దాన్ని ‘డెడ్ బాల్’గా ప్రకటించాలి కదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరేమో రాణా హిట్ వికెట్ అయ్యాడని, మరికొందరేమో కీపర్ సంజు శాంసన్ వికెట్లను తగిలాడని రకరకాలుగా వాదించుకుంటున్నారు. కానీ గ్రౌండ్‌లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, ఢిల్లీలో వీస్తున్న బలమైన గాలుల వల్లే ఆ బెయిల్స్ కింద పడ్డాయి.
క్రికెట్ నిబంధనల ప్రకారం.. బ్యాటర్ షాట్ ఆడే క్రమంలో గానీ, రన్ తీయబోయే ముందు గానీ తన బ్యాటుతోనో లేదా శరీరంతోనో వికెట్లను పడేస్తేనే దాన్ని ‘హిట్ వికెట్’ అంటారు. ఇక్కడ రాణా వికెట్లను తాకలేదు కాబట్టి అది హిట్ వికెట్ కాదు. అలాగే కీపర్ వల్ల కూడా ఆ బెయిల్స్ పడలేదు. కేవలం గాలి వల్లే అవి కింద పడ్డాయి కాబట్టి అంపైర్లు దాన్ని అవుట్‌గానే పరిగణించారు.
ఇక ‘డెడ్ బాల్’ విషయానికి వస్తే.. బౌలర్ బంతిని రిలీజ్ చేయకముందే ఏదైనా ఆటంకం కలిగితే దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బౌలర్ చేతి నుంచి బంతి ఇప్పటికే బయటకు వచ్చింది, పైగా ఆ బెయిల్స్ పడిపోవడం వల్ల బ్యాటర్ ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. క్రికెట్ లో ఉన్న రూల్స్ ప్రకారం.. బ్యాటర్ బంతిని ఆడే సమయంలో ఏదైనా శబ్దం వల్ల గానీ, కదలిక వల్ల గానీ ఏకాగ్రత దెబ్బతింటేనే దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటించాలి. ఇక్కడ రాణా తన షాట్ తాను ఆడాడు కాబట్టి అంపైర్లు దాన్ని డెడ్ బాల్‌గా ఇవ్వలేదు. ఫీల్డ్ అంపైర్లు కూడా ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. రాణా క్లియర్ గా క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు కాబట్టి రూల్స్ ప్రకారం అది అవుటే అని తేల్చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates