గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు చెప్పేయొచ్చు. ఇప్పుడు భారత క్రికెట్లో అతనంత వ్యతిరేకతను ఎవ్వరూ ఎదుర్కోవట్లేదు అంటే అతిశయోక్తి కాదు. చిన్న వయసులోనే ఐపీఎల్‌లో ఆల్ రౌండ్ మెరుపులతో అభిమానుల దృష్టిని ఆకర్షించి.. ఈ తరానికి మరో ‘కపిల్ దేవ్’ అనిపించుకున్నాడు ఈ బరోడా క్రికెటర్.
ముంబయి ఇండియన్స్ తరఫున నిలకడగా రాణించడంతో త్వరగానే భారత జట్టులో చోటు దక్కింది. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ఆడుతూ మంచి పేరు సంపాదించాడు. చాలా ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ముంబయికే ఆడిన హార్దిక్.. 2022లో అప్పుడే లీగ్‌లోకి అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్‌కు మారిపోయాడు.
ఆ జట్టు కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్లోనే జట్టును అద్భుతంగా నడిపించి టైటిల్ అందించాడు. దీంతో హార్దిక్ పేరు మార్మోగింది. ఆ వెంటనే అతను భారత టీ20 జట్టుకు కూడా కెప్టెన్ అయ్యాడు. అది హార్దిక్ కెరీర్లో పీక్ మూమెంట్.
అప్పటిదాకా వచ్చిన పేరును నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోయి ఉంటే బాగుండేది. కానీ 2024 సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌కు రావాలన్న తన నిర్ణయం తన కెరీర్‌ను తలకిందులు చేసింది.
కెప్టెన్సీ ఇస్తేనే ముంబయికి వస్తా అని కండిషన్ పెట్టి అనుకున్నది సాధించుకున్నాడు కానీ.. భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిలో విలన్ అవుతానని ఊహించలేకపోయాడు. ముంబయికి ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను బలవంతంగా తప్పించి హార్దిక్‌ను కెప్టెన్‌ను చేయడంతో తీవ్ర వ్యతిరేకత తప్పలేదు.
హార్దిక్ ముంబయి కెప్టెన్ అయి ఇది మూడో సీజన్. ఇంకా కూడా అతడి మీద అభిమానుల వ్యతిరేకత తగ్గలేదు. దీనికి తోడు ముంబయి ప్రదర్శన పడిపోవడంతో హార్దిక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడి ఏడు ఓటములు ఖాతాలో వేసుకున్న ముంబయి దాదాపుగా ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది.
ముంబయి ఇంత ఘోరమైన ప్రదర్శన చేయడం అరుదు. ఈ వైఫల్యానికి హార్దిక్‌నే ప్రధాన బాధ్యుడిగా చూస్తున్నారు. ఆట ఇలా తయారైతే.. ఇంకోవైపు వ్యక్తిగత ప్రవర్తన కూడా హార్దిక్ మీద తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నటాషాకు విడాకులు ఇచ్చాక కొత్త అమ్మాయితో రిలేషన్‌షిప్ మొదలుపెట్టిన అతను.. ఆమెతో కలిసి వేస్తున్న వేషాలు అన్నీ ఇన్నీ కాదు.
గ్రౌండుకు ఆమెను తీసుకొచ్చి చేస్తున్న అతి.. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చిరాకు పుట్టిస్తున్నాయి జనాలకు. దీంతో వ్యతిరేకత ఇంకా పెరుగుతోంది. గుజరాత్ కెప్టెన్‌గా గొప్ప పేరు సంపాదించిన వాడు.. అక్కడే ఉండుంటే ఐపీఎల్ మేటి కెప్టెన్లలో ఒకడిగా కొనసాగేవాడు. ఎంతో గౌరవం ఉండేది. కానీ ముంబయికి వచ్చి మొత్తం పేరు పోగొట్టుకున్నాడు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. చేజేతులా కెరీర్‌ను దెబ్బ తీసుకోవడం అంటే ఏంటో చెప్పడానికి హార్దిక్ పాండ్యనే ఉదాహరణ.
Gulte Telugu Telugu Political and Movie News Updates