నిజమేనండోయ్… భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా నమోదు కాలేదు. పగటి పూట కూడా చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత అంతగా కనిపించలేదు. చల్లగా, ఒకింత ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులే కనిపించాయి. అయితే ఆ తరహా పరిస్థితులకు ఫుల్ స్టాప్ పడిపోయింది. భానుడి ప్రతాపం అంతకంతకూ పెరుగుతోంది. ఏప్రిల్ మాసం తొలి అర్త భాగంలోనే 40 డిగ్రీల వేడి హడలు పుట్టిస్తోంది. ఇక ఈ నెల 12 నుంచి ఈ వేడిమి 44 డిగ్రీల దాకా వెళ్లవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భానుడి ప్రతాపం పెరిగిపోగా… తాజాగా తెలంగాణలోనూ భానుడి భగభగలు పెరుగుతున్నాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీల వేడిమి నమోదు కాగా… తాజాగా తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలోని ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఈ నెల 12 నుంచి 22 దాకా ఎండ వేడి అధికంగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది.
ఇక హైదరాబాద్ నగరంలోనూ భానుడి ప్రతాపం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 40 డిగ్రీలకు చేరువగా వచ్చిన ఎండ తీవ్రత ఈ నెల 10 నుంచి అంటే,…శుక్రవారం నుంచి ఓ రేంజిలో పెరిగిపోనుందట. దీంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోవడం ఖాయమేనట. కొంతకాలం పాటు చల్లగా సాగిన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్టులు జారీ చేసిన వాతావరణ శాఖ… తాజాగా రెడ్ అలెర్టులనూ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా భానుడు ప్రతాపం చూపనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. వసల కూలీలు ప్రతి గంటకు ఓ 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని పని కొనసాగించాలని సూచించింది. ఇక సూర్యతాపాన్ని తగ్గించే పానీయాల వినియోగాన్ని పెంచాలని కూడా వాతావరణ శాఖ సలహా ఇచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates