కోదండరాం జీవితం కేసీఆర్‌కు దూత పాత్రేనా?

కోదండరాం జీవితం కేసీఆర్‌కు దూత పాత్రేనా?

కోదండరాం తాను స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోగల నాయకుడిగా అసలు వ్యవహరిస్తున్నారా? లేదా, కేసీఆర్‌ తరఫు మనిషిలాగా మాత్రమే ప్రవర్తిస్తున్నారా? తాజాగా చలో అసెంబ్లీ అనంతర పరిణామాలను గమనిస్తున్న ఎవ్వరికైనా ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. సఫలమో విఫలమో మొత్తానికి తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి.. అన్ని పార్టీలు కలసి పిలుపు ఇచ్చిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా యావత్తు తెలంగాణ  ప్రాంతం అంతటా కూడా.. బైండోవర్లు, అరెస్టులు, నిర్బంధాలు, తనిఖీలు వంటి పోలీసుచర్యలు అనేకం జరిగాయి.

అయితే ఈ అరెస్టులు అక్రమం అని నిరసిస్తూ కార్యక్రమం వైపు కన్నెత్తి కూడా చూడకుండా గడిపిన కేసీఆర్‌ సాయంత్రానికి నిప్పులు చెరిగారు. శనివారం బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ బంద్‌కు పిలుపు అనేది తనొక్కడే ఇచ్చారు. అంటే ఉద్యమం అన్ని పార్టీలు కలిసి చేస్తే బంద్‌ తెరాస మాత్రమే చేస్తుందన్నమాట. ఈ నిర్ణయం సహజంగానే ఇతర తెలంగాణ పార్టీలకు మంట పుట్టించింది. తెరాస మాదిరిగానే ప్రతి ఉద్యమంతోనూ అంతో ఇంతో తమకు కూడా కొన్ని ఓట్లు తయారుచేసుకోవాలని తపన పడుతున్న భాజపాకు మంట మరీ ఎక్కువైంది. ఇలా ఏకపక్ష
నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపడుతూ.. కేసీఆర్‌ హీరో అయిపోవాలనుకుంటున్నారా?..  ఎవ్వరితోనూ సంప్రదించకుండా ఈ బంద్‌ నిర్ణయమేంటి అంటూ నిప్పులు చెరిగారు.

ఇలాంటప్పుడు జేఏసీ సారధిగా అన్ని పార్టీల్ని కలుపుకుపోవలసిన కోదండరాం చేయాల్సిన పని ఏమిటి? కేసీఆర్‌కు నచ్చజెప్పి ఆయన అందరితో మాట్లాడేలా చూడాలి. అయితే అందుకు భిన్నంగా ఆయన కిషన్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆయన్ను చల్లబరిచేందుకు ప్రయత్నించారు. నిజానికి ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా భాజపా, సీపీఐ కూడా విడివిడిగా నిరసనలు చేపడుతున్నాయి. అయితే కేసీఆర్‌ ఒక్కరే దూకుడుగా ఒంటరి క్రెడిట్‌ తీసుకుంటున్నారు. దీన్ని కిషన్‌ తప్పుపడితే.. కేసీఆర్‌ తరఫున ఆయన్ను మెత్తబరచడానికి కోదండరాం ప్రయత్నించడం చాలా మంది తెలంగాణ వాదులకు చీదరగా అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు