సొంత బేనరే కాపాడాలి

టాలీవుడ్ యంగ్ హీరోల్లో అనూహ్యంగా రైజ్ అయి.. ఇంకో స్థాయికి వెళ్తాడనే అంచనాలు కలిగించి.. చివరికి ఉన్న స్థాయిని కాపాడుకోవడమే కష్టంగా మారిపోయిన పరిస్థితి నాగ శౌర్యది. అతడి కెరీర్‌ను ‘ఛలో’కు ముందు, ‘ఛలో’ తర్వాత అని విభజించి చూడాలి. ఆ సినిమాతో అతను భారీ విజయాన్నే అందుకున్నాడు. అప్పటిదాకా నాలుగైదు కోట్ల బిజినెస్ చేయడం కూడా కష్టమన్నట్లుండేది అతడి సినిమాల పరిస్థితి. కానీ ఈ సినిమా థియేట్రికల్ షేరే రూ.10 కోట్లకు పైగా వచ్చింది. నాని కెరీర్లో ‘భలే భలే మగాడివోయ్’ తరహాలో ఇది నాగశౌర్య కెరీర్‌కు గొప్ప మలుపులా కనిపించింది.

బయటి బేనర్లలో, వేరే నిర్మాతలతో సినిమాలు చేసినంత కాలం నాగశౌర్య ఒక స్థాయిని మించి ఎదగలేకపోగా.. ‘ఐరా క్రియేషన్స్’ పేరుతో సొంత బేనర్ పెట్టి ఓ సినిమా చేయగానే మొత్తం కథ మారిపోయింది. అతడి కెరీర్‌కు కొత్త ఊపును తెచ్చింది సొంత నిర్మాణ సంస్థ.

శౌర్య ఆ తర్వాత సొంత బేనర్లో చేసిన ‘నర్తనశాల’, ‘అశ్వథ్థామ’ సినిమాలు చేయగా.. వాటికి మంచి హైప్ వచ్చింది. అవి ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చాయి. ‘అశ్వథ్థామ’ తర్వాత సొంత నిర్మాణ సంస్థను పక్కన పెట్టి వరుసగా బయటి బేనర్లకు సినిమాలు చేశాడు శౌర్య. కానీ ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ‘వరుడు కావలెను’ మంచి సినిమా అయినా రిలీజ్ టైమింగ్ సరిగా కుదరక ఫెయిల్యూరే అయింది. ‘లక్ష్య’ సంగతి చెప్పాల్సిన పని లేదు. శౌర్య కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం.

ఇప్పుడు నాగశౌర్య కెరీరే ప్రమాదంలో పడ్డ స్థితిలో మళ్లీ సొంత బేనర్లో సినిమా చేస్తున్నాడతను. ఆ చిత్రమే.. కృష్ణా వ్రిందా విహారి. ఈ సినిమా కోసం బ్రాహ్మణ కుర్రాడిగా అతను సరికొత్త అవతారంలోకి మారాడు. ఇది అచ్చ తెలుగు సంప్రదాయ సినిమాలా కనిపిస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్ ప్లెజెంట్‌గా అనిపించాయి. ‘అలా ఎలా’తో తనపై అంచనాలు పెంచి.. ఆ తర్వాత వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్న అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శుకుడు. షిర్లీ సెటియా ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. మరి ఈ సినిమాతో అయినా శౌర్య పుంజుకుని కెరీర్‌ను గాడిలో పెట్టుకుంటాడేమో చూడాలి