లోకేష్ ఫ్యూచర్ కోసం నెటిజన్ల సలహా

లోకేష్ ఫ్యూచర్ కోసం నెటిజన్ల సలహా

తాజా ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ నేతలకు వరుస ఇబ్బందులు తప్పడం లేదు. ఓటమి భారంతో బయటకు వచ్చేందుకు టీడీపీ నేతలు సాహసించడం లేదు. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తమ వద్దకు రాకపోతేనేమీ.... తామే ఆయన వద్దకు వెళతామంటూ పలు జిల్లాలకు చెందిన టీడీపీ సానుభూతిపరులు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. సరే... పార్టీ అధినేత, 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన నేత కదా. అధికారంలో ఉన్నా... విపక్షంలో ఉన్నా ఆయన వద్దకు జనాలు రావడం సహజమే.

అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలోకి దిగిన చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్... గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటమి చవిచూశారు. అరంగేట్రంలోనే ఓటమి చవిచూసిన లోకేశ్ పెద్దగా బయటకే రావడం లేదు. ఈ క్రమంలో తన తండ్రి బాటలోకే వచ్చేసిన లోకేశ్ నేటి ఉదయం తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. తనను కలిసేందుకు ఏపీ, తెలంగాణకు చెందిన కార్యకర్తలు వచ్చారని, వారిని కలవడం తనకు సంతోషంగా ఉందని, ఫొటోలతో పాటు ఓ కామెంట్ కూడా పెట్టారు. లోకేశ్ అలా ట్వీట్ పెట్టారో, లేదో... నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. ఓటమి పాలైనా నేర్చుకోకపోతే ఎలా?అంటూ నెటిజన్లు ఆయనపై ఓ రేంజిలో ఫైర్ అయిపోయారు.

‘జనాలు మీ వద్దకు రావడం కాదు... మీరే జనాల వద్దకు వెళ్లాలి. ఓటమి దక్కినా... ఇంకా తత్వం బోధపడలేదా?‘,  ‘టీడీపీ దీపం ఆరిపోయింది. ఇక ఎంత వెలిగించినా ప్రయోజనం లేదు. ఇక మీరు రిటైర్ కండి. మీరో విఫల రాజకీయ నేత కిందే లెక్క‘, ‘2024 ఎన్నికల్లో మీ నాయకత్వంలో తెలంగాణ రోడ్లను క్లీన్ స్వీప్ చేద్దాం. టీ టీడీపీ బాధ్యతలు తీసుకోండి. కర్ణాటక లోకల్ బాడీ ఎన్నికల్లోనూ 50 శాతం సీట్లలో పోటీ చేద్దాం‘  అంటూ వరుసగా సెటైర్ల మీద సెటైర్లు పడిపోయాయి. అయినా ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్లని కారణంగానే కదా ఓడిపోయాము... అయినా కూడా తత్వాన్ని అర్థం చేసుకోలేక ఇలాంటి ట్వీట్లు, జనాలు మా వద్దకు వస్తున్నారని కామెంట్లతో పని కాదంటూ నెటిజన్లు లోకేశ్ కు తమదైన శైలిలో షాకిచ్చారు.

2014 కు ముందు చంద్రబాబు పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లడం చాలా బాగా పనిచేసింది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్న లోకేష్ ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే మంచిదేమో. తమకు అండగా ఉంటారు అని నమ్మితేనే జనం నాయకుడి వెంట నడుస్తారు. ఈ లాజిక్ వెంటనే పసిగట్టాలి సుమా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English