మా ఎమ్మెల్యే కాబోయే మంత్రి...వైసీపీ నేత‌ల ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు...

మా ఎమ్మెల్యే కాబోయే మంత్రి...వైసీపీ నేత‌ల ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు...

ఏపీలో పోలింగ్ పూర్త‌యి జ‌రిగి దాదాపు నెల‌రోజులు కావస్తోంది. ఫ‌లితాల విడుద‌ల‌కు మ‌రో 14 రోజుల స‌మ‌యం మిగిలింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అధికారం త‌మ‌దేన‌ని డిసైడ‌యిపోతున్నారు. అంతేకాకుండా చిత్ర‌మైన ఊహ‌ల్లో తేలిపోతున్నారు. అధికారం తమకే ఖాయమన్నట్లు ప్రవర్తిస్తుండ‌ట‌మే కాకుండా...అప్పుడే మంత్రి పదవులను పంచేసుకుంటున్నారు. ఇలా ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఊహల్లో తేలే క్ర‌మంలో వారి అనుచ‌రులు మ‌రో అడుగు ముందుకు వేసి అప్పుడే సంబురాలు సైతం చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు స‌హా ఇత‌ర రూపాల్లో త‌మ నాయ‌కుడికే  మంత్రి ప‌ద‌వి అంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

తాజాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను కాబోయే మంత్రి వర్యులంటూ ఆయన అనుచరులు బ్యానర్లు కట్టడం పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేవ‌లం ప్ర‌చారం చేయ‌డ‌మే కాకుండా మ‌రో అడుగు ముందుకు వేశారు. జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఆ బాటిల్‌పై కాబోయే మంత్రి ఉదయభాను అంటూ స్టిక్కర్లు అంటించారు. ఎన్నికల ఫలితాలే రాలేదు. అప్పుడే ఈదేమి చోద్యమంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మినరల్ వాటర్ బాటిల్‌పై కాబోయే మంత్రివర్యులు ఉదయభాను అనే స్టిక్కర్లు చర్చనీయాంశంగా మారాయి.

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేందుకు ముందే ఇలాంటి ప‌రిస్థితులు ఉంటే...ఫ‌లితాల రోజు ఇంకెంత సంద‌డిగా ఉంటుందోనని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. వైసీపీ నేత‌లు ఊహించిన‌ట్లే... ఫ‌లితాలు ఒక‌వేళ వారికి అనుకూలంగా వ‌స్తే..ఇలా ఆశ‌లు పెట్టుకున్న నేత‌లంద‌రికీ...మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయా? ఒక‌వేళ ప‌ద‌వులు ద‌క్క‌క‌పోతే ప‌రిస్థితి ఏంటి? అయినా...ఎంత న‌మ్మ‌కం ఉన్నా ఇలా ఫ‌లితాల‌కు ముందే ప్ర‌చారం చేసుకోవ‌డం ఏంటి అని ప‌లువురు స‌హ‌జంగానే చ‌ర్చించుకుంటున్నారు. ఈ విష‌యం వైసీపీ నేత‌ల‌కు ఎప్పుడు అర్థ‌మ‌వుతుందో మ‌రి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English