లంకలో టీడీపీ నేత‌!... ఉగ్ర‌దాడిలో గాయాలు!

లంకలో టీడీపీ నేత‌!... ఉగ్ర‌దాడిలో గాయాలు!

శ్రీ‌లంకలో నేటి ఉద‌యం వ‌రుస‌గా చోటుచేసుకున్న ఉగ్ర‌వాద దాడుల‌కు సంబంధించిన వార్త‌లు ఒక‌దాని వెంట ఒక‌టి వ‌స్తున్నాయి. ఈ దాడుల్లో భార‌తీయులు 11 మంది చ‌నిపోయార‌ని కొంద‌రు అంటుంటే... ఒక్క భార‌తీయుడు కూడా చ‌నిపోయిన‌ట్టుగా ఇప్ప‌టిదాకా ప‌క్కా ఆధారాలు ల‌భించ‌లేదు. ఇక కొలంబోలో ఉగ్ర‌దాడి జ‌రిగిన హోట‌ల్ లో బ‌స చేసిన సీనియ‌ర్ న‌టి రాధిక తృటిలో త‌ప్పించుకున్నారు. ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌డానికి కాస్తంత ముందుగా ఆమె త‌న గ‌దిని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

అయితే కొలంబోలోనే రాధిక బ‌స చేసిన సిన‌మ‌న్ గ్రాండ్ హోట‌ల్ లో కాకుండా... అదే న‌గ‌రంలోని ఇంకో పెద్ద హోటల్ షాంగ్రీలాలో బ‌స చేసిన ఏపీలోని అనంత‌పురం జిల్లాకు చెందిన టీడీపీ నేత‌, ఎస్ఆర్ క‌న‌స్ట్ర‌క్ష‌న్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు మాత్రం ఈ దాడుల నుంచి త‌ప్పించుకోలేక‌పోయారు. సిన‌మ‌న్ గ్రాండ్ తో పాటు షాంగ్రీలాపైనా ఉగ్ర‌దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

న‌లుగురు మిత్ర బృందంతో క‌లిసి శ్రీ‌లంక టూర్ కు వెళ్లిన సురేంద్ర బాబు షాంగ్రీలా హోట‌ల్ లో బ‌స చేశారు. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం ఆయ‌న హోట‌ల్ లోనే టిఫిన్ చేస్తున్న స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు హోట‌ల్ పై దాడికి దిగారు. దీంతో హోట‌ల్ లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగ‌గా... తొక్కిస‌లాట చోటుచేసుకుంది. ఈ తొక్కిస‌లాట‌లో సురేంద్ర‌బాబుకు స్వ‌ల్ప గాయాలయ్యాయ‌ట‌. ఆ త‌ర్వాత వెనువెంట‌నే తేరుకున్న సురేంద్ర బాబు అండ్ కో ప్రాణభయంతో హోటల్‌ ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చేశార‌ట‌.

ఈ క్ర‌మంలో సురేంద్ర బంధువులు... ఆయ‌న‌ క్షేమంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరికి సంబంధించిన పాస్‌పార్ట్‌లు, లగేజీ హోటల్‌ గదిలోనే ఉండిపోవడంతో సురేంద్ర బాబు అండ్ కో సాయం కోసం ఎదురు చూస్తున్నారట‌. మొత్తంగా దాడి జ‌ర‌గడానికి నిమిషాల ముందు హోట‌ల్ గ‌దిని ఖాళీ చేసి రాధిక దాడుల నుంచి త‌ప్పించుకుంటే... సురేంద్ర బాబు మాత్రం ఈ దాడుల నుంచి తప్పించుకోలేక‌పోయార‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English