వాస్తు తేడానా? క‌మ‌ల‌నాథుల‌కు క‌లిసి రాని కొత్త ఆఫీస్!

వాస్తు తేడానా?  క‌మ‌ల‌నాథుల‌కు క‌లిసి రాని కొత్త ఆఫీస్!

కొన్నిసార్లు అంతే. ఎంతో ఆశ‌ప‌డి.. మ‌రింత మోజుతో నిర్మించుకునే నిర్మాణాలు అస్స‌లు ప‌నికిరావు. అక్క‌ర‌కూ రావు. తాజాగా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది బీజేపీ. రికార్డు స‌మ‌యంలో అత్యాధునిక వ‌స‌తుల‌తో.. భారీ ఖ‌ర్చుతో నిర్మించిన బీజేపీ కొత్త కార్యాల‌యం ఇప్పుడు ఆ పార్టీకి చుక్క‌లు చూపిస్తోంద‌ట‌.

వ‌రుస పెట్టి వ‌స్తున్న ఫెయిల్యూర్ కు కార‌ణం కొత్త ఆఫీసే అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది.ఏడాదిన్నర వ్య‌వ‌ధిలో భారీగా నిర్మించిన ఐదు అంత‌స్తుల విలాస‌వంత‌మైన బీజేపీ కేంద్ర కార్యాల‌యంపై ఇప్పుడు అనుమాన‌పు నీడ‌లు ప‌రుచుకుంటున్నాయి. సక‌ల హంగుల‌తో నిర్మించిన ఈ కొత్త కార్యాల‌యంలో వాస్తు లోప‌మా?  మ‌రింకేమైనా కార‌ణమో కానీ.. ఈ కార్యాల‌యం పార్టీకి అందుబాటులోకి వ‌చ్చిన నాటి నుంచి ఎదురుదెబ్బ‌లే ఎదురుదెబ్బ‌ల‌ని చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 18న ప్రారంభ‌మైన ఈ కార్యాయ‌లంలోకి పార్టీ కార్యాక‌లాపాలు మారిన నాటి నుంచి పార్టీ వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న‌ట్లు చెబుతున్నారు. పాత బిల్డింగ్ లో నుంచి కొత్త భ‌వ‌నంలోకి మారాక యూపీలోని గోర‌ఖ్ పూర్.. ఫూల్ పూర్.. కైరానా లోక్ స‌భ స్థానాలకు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి పాలు కావ‌ట‌మేకాదు.. క‌ర్ణాట‌క‌లో అత్య‌ధిక స్థానాలు సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ.. అధికారం అర చేతి దూరంలో ఆగిపోవ‌టం తెలిసిందే.

అంతేకాదు.. న‌మ్మ‌క‌స్తులైన మిత్రులుగా చెప్పే టీడీపీ.. పీడీపీలు దూరం కావ‌టం.. ఏళ్ల‌కు త‌ర‌బ‌డి బీజేపీతో అనుబంధం ఉన్న శివ‌సేన తెగ తెంపుల‌కు సిద్ధ‌మైన తీరు కూడా కొత్త బిల్డింగ్ ఎఫెక్టేన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల కార్య‌క‌లాపాల్ని ఎట్టి ప‌రిస్థితుల్లో కొత్త భ‌వ‌నంలో నిర్వ‌హించొద్ద‌ని.. మ‌ళ్లీ అశోకా రోడ్‌లోని 11వ నెంబ‌రులో ఉండే పాత కార్యాల‌యంలోనే చేప‌ట్టాల‌న్న డిమాండ్ పెరుగుతోంది.

అంతేకాదు.. వ‌చ్చేఎన్నిక‌ల వార్ రూంను మోడీకి ఎంత‌గానో క‌లిసి వ‌చ్చిన య‌శోనాయ‌క్ కు చెందిన లోధీ ఎస్టేట్ బంగ‌ళాను వార్ రూంగా ఉప‌యోగించాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది.300 మందితో 24 గంట‌లు ప‌ని చేసే ఈ కొత్త వార్ రూం ఏర్పాటు విష‌యంపై బీజేపీ కిందా మీదా ప‌డుతోంది. ముచ్చ‌ట ప‌డి నిర్మించుకున్న కొత్త భ‌వ‌నం కొత్త క‌ష్టాల్ని తెచ్చి పెట్టింద‌న్న సందేహాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English