జ‌గ్గారెడ్డి అరెస్టు వెనుక అస‌లేం జ‌రిగింది?

జ‌గ్గారెడ్డి అరెస్టు వెనుక అస‌లేం జ‌రిగింది?

ఓవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి తారాస్థాయిలో జ‌రుగుతుంటే...మ‌రోవైపు క‌ల‌క‌లం చోటుచేసుకునే అరెస్ట్ జ‌రిగింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మై కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిప‌డేలా ఆ పార్టీకి చెందిన నాయ‌కుడు ఒక‌రిని పోలీసులు జైలు పాలు చేశారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా...అస‌లు విష‌యం ఏంట‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

వివ‌రాల్లోకి వెళితే...2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సంపాదించారు. వాటి ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లతో వీసాలు పొంది.. ముగ్గురినీ తన వెంట అమెరికాకు తీసుకెళ్లారు. వారిని అక్కడ ఉంచిన జగ్గారెడ్డి.. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఈ ముగ్గురు అమెరికాకు వెళ్లి పద్నాలుగు ఏళ్ల‌యినా ఇంతవరకు తిరిగిరాలేదు. దీనిపై అనుమానం వచ్చిన అమెరికన్ కాన్సులేట్ అధికారులు.. ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విచారణ చేపట్టిన పోలీసులు.. జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అందులో కొడుకు, కూతురు, భార్య పేర్లు ఉన్నా.. ఫొటోలు మాత్రం వేరేవారివిగా గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తుచేశారు. అందులో.. గుజరాత్‌కు చెందిన ఒక కుటుంబాన్ని అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు నిర్ధారణ అయింది.

దీంతో సోమవారం రాత్రి నార్త్‌జోన్ పోలీసులు పటాన్‌చెరులో జగ్గారెడ్డిని అరెస్టుచేశారు. ఈ మేరకు నార్త్‌జోన్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ సుమతి తెలిపారు.

కాగా, ఈ కేసు మరిన్ని మ‌లుపులు తిరుగుతోంది. ఈ కేసుతో ముగ్గురికి సంబంధం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. సంగారెడ్డికి చెందిన జెట్టి కుసుమకుమార్, నిజామామాద్‌కు చెందిన మధుసూదన్‌రావు, హైదరాబాద్‌కు చెందిన రషీద్ అనే వ్యక్తులు కూడా జగ్గారెడ్డితోపాటు అమెరికాకు వెళ్లివచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొందరు మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కూడా ఈ దందాలో భాగం ఉందనే అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతంలో 2007 మే 3న తప్పుడు ధ్రువపత్రాలతో పాస్‌పోర్టులు పొందారనే ఆరోపణలతో అప్పటి ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, కాసిపేట లింగయ్యపై కేసు నమోదైన విషయం తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నలుగురిని అమెరికాకు అక్రమంగా తరలించారని వారిపై కేసు నమోదుచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English