స్విస్ లో ఉన్న‌దంతా బ్లాక్ మ‌నీ కాద‌ట‌!

స్విస్ లో ఉన్న‌దంతా బ్లాక్ మ‌నీ కాద‌ట‌!

స్విస్ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయ‌ల న‌ల్ల ధ‌నం మూలుగుతోంద‌ని, దానిని వెన‌క్కు ర‌ప్పించి ప్ర‌తి భార‌తీయుడి ఖాతాలో 15ల‌క్ష‌ల రూపాయ‌లు వేస్తాన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ....2014 ఎన్నిక‌లకు ముందు ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. అయితే, మోదీ చెప్పినట్లు స్విస్ బ్యాంకులో న‌ల్ల‌ధ‌నం భార‌త్ కు రాక‌పోగా.... 2016-17 మ‌ధ్య కాలంలో స్విస్ లో భార‌తీయుల డిపాజిట్లు 50 శాతం పెరిగాయ‌ని ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. స్విస్ లో భార‌తీయుల‌ డిపాజిట్లు రూ 7,000 కోట్లకు చేరాయ‌ని ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో,నేడు జ‌రుగుతున్న రాజ్య‌స‌భ స‌మావేశాల సంద‌ర్భంగా ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. స్విస్ లో ఉన్న డ‌బ్బంతా నల్ల ధనమేన‌ని ఎలా భావిస్తామంటూ ఆర్థికశాఖ మంత్రి పియూష్ గోయల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్విస్ లో ఉన్న అన్ని భార‌తీయ ఖాతాల్లో న‌ల్ల‌ధ‌నం లేద‌ని స్విస్ బ్యాంకు తెలిపింద‌ని పీయూష్ వెల్ల‌డించారు.

నేడు రాజ్య‌స‌భ‌లో స్విస్ బ్యాంకుల్లో న‌ల్ల‌ధ‌నం అంశంపై వాడీవేడీ చ‌ర్చ జ‌రిగింది. విప‌క్ష స‌భ్యులు లేవ‌నెత్తిన అంశాల‌కు పీయూష్ స‌మాధాన‌మిచ్చారు. ఆ 50 శాతం డిపాజిట్లు పెరిగిన మాట అవాస్త‌వ‌మ‌ని అన్నారు. స్విస్ లోని అన్ని ఖాతాల్లో బ్లాక్ మ‌నీ లేద‌ని స్విస్ బ్యాంకు వెల్ల‌డించింద‌ని పీయూష్ అన్నారు. భార‌త్ లోని స్విస్ బ్రాంచీల లావాదేవీలు, ఇంట‌ర్ బ్యాంక్ లావాదేవీలు, నాన్ డిపాజిట్ లావాదేవీలను క‌లుపుకొని 50 శాతం డిపాజిట్లు అయ్యాయ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ స‌మాచారాన్ని కొంద‌రు త‌ప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. 2014 త‌ర్వాత స్విస్ బ్యాంకు లోని భార‌తీయుల న‌ల్లధ‌నం వివరాలకు సంబంధించి 4000 పేజీల స‌మాచారం తెప్పించామ‌ని, దానిపై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని అన్నారు. తాజాగా ఇరుదేశాల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం...స్విస్ బ్యాంకులోని లావాదేవీల వివ‌రాల‌ను ఆ దేశం వెల్ల‌డించేందుకు అంగీక‌రించింద‌ని చెప్పారు. ఈ చ‌ర్చ సంద‌ర్భంగా విప‌క్ష స‌భ్యులు గంద‌ర‌గోళం సృష్టించ‌డంతో...రాజ్య‌స‌భ‌ను వాయిదా వేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు