ఖైదీ రీమేక్‌, సీక్వెల్‌కు బ్రేకులు

త‌మిళ క‌థానాయ‌కుడు కార్తి కెరీర్లో మేటి చిత్రాల్లో ఒక‌ట‌న‌ద‌గ్గ సినిమా ఖైదీ. ఈ మ‌ధ్యే మాస్టర్ చిత్రంతో ప‌ల‌క‌రించిన లోకేష్ క‌న‌క‌రాజ్ దాని కంటే ముందు రూపొందించిన చిత్ర‌మిది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఆ చిత్రం మంచి విజ‌యం సాధించింది. కార్తి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని అందులోనే సంకేతాలు ఇవ్వ‌డం తెలిసిందే.

కార్తి సైతం ఖైదీ-2 చేసే అవ‌కాశాలున్న‌ట్లు ఈ మ‌ధ్యే ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఖైదీ హిందీలోకి కూడా రీమేక్ అవుతున్న సంగ‌తీ విదిత‌మే. ఐతే ఇప్ప‌డు ఈ చిత్ర రీమేక్, సీక్వెల్‌ల‌కు బ్రేకులు ప‌డ్డాయి. ఈ సినిమా క‌థ విష‌యంలో వివాదం నెల‌కొన‌డం, వ్య‌వ‌హారం కోర్టుకు చేర‌డ‌మే ఇందుక్కార‌ణం.

ఖైదీ చిత్ర‌ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభుపై కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశాడు. తన కథను చోరీ చేసి ‘ఖైదీ’ చిత్రాన్ని తీశార‌ని.. అందువల్ల తనకు రూ.4 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని అత‌ను త‌న పిటిష‌న్లో కోర్టును కోరాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కేరళ రాష్ట్ర హైకోర్టు.. నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభుకు నోటీసులు జారీ చేసింది. అంతే కాక ఖైదీ చిత్రాన్ని ఇతర భాషల్లోకి అనువదించ‌కూడ‌ద‌ని.. రీమేక్‌ కూడా చేయొద్ద‌ని.. అలాగే సీక్వెల్‌ కూడా తీయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంట‌నే హిందీ రీమేక్ ప‌నులు ఆపేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. అలాగే సీక్వెల్ దిశ‌గా కూడా ఇప్పుడు స‌న్నాహాలు చేయ‌డానికి వీల్లేకపోయింది.

ఈ కోర్టు కేసేదో తేలే వ‌ర‌కు రీమేక్, సీక్వెల్ సంగతి ప‌క్క‌న పెట్టాల్సిందే. మ‌రి కోర్టు ఈ కేసు విష‌యంలో ఏం చెబుతుందో చూడాలి. ఖైదీలో హీరో గ‌తం ప్ర‌ధానంగా.. అత‌నెందుకు జైలుకు వెళ్లాడో ఖైదీ-2 తీయాలనే ఆలోచ‌న‌తో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ఉన్నాడు.