యువి.. వరుణ్.. గాంధీ

యువి.. వరుణ్.. గాంధీ

ఇప్పటిదాకా యువి క్రియేషన్స్ వాళ్లు చేసిన సినిమాలన్నింటికీ కలిపి ఎంత బడ్జెట్ పెట్టి ఉంటారో.. అంత బడ్జెట్ ఒక్క ‘సాహో’కే అయింది. బిజినెస్ లెక్కలు కూడా ఇదే తరహాలో ఉంటాయి. ఐతే చిన్న, మీడియం రేంజి సినిమాలు చేసినంత కాలం వారికి మంచి ఫలితాలే దక్కాయి. ఈ సంస్థకూ లాభాలొచ్చాయి. బయ్యర్లూ లాభపడ్డారు. కానీ ‘సాహో’ లాంటి మెగా ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నారు. ఇప్పుడు ఆ భారాన్ని మోయలేక ఇబ్బంది పడుతున్నారు.

బయ్యర్లకు భారీ నష్టాలు రావడంతో వాటిని సెటిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ ఇలాంటి భారీ సినిమా చేసే ఉద్దేశాలేమీ యువి వాళ్లకు లేనట్లుంది. ముందు ప్రభాస్ తర్వాతి సినిమాను కూడా యువి క్రియేషన్స్‌లోనే చేయాల్సింది కానీ.. తర్వాత ప్లాన్ మారింది. ఆ చిత్రాన్ని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణా మూవీస్ టేకప్ చేసింది.

ఇప్పుడు యువి వాళ్లు పాత స్టయిల్లో ఒక మీడియం రేంజి సినిమా చేయడానికి రెడీ అవుతనున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ ఆ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తాడట. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి సూపర్ హిట్లు తీసిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట.

‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాను గాంధీ యువి బేనర్లోనే చేశాడు. ఐతే దీని తర్వాత అతను చేసిన  ‘కృష్ణార్జున యుద్ధం’ ఫ్లాప్ అయింది. దీంతో గాంధీ ఏడాదికి పైగా కనిపించకుండా పోయాడు. ఇప్పుడతను మళ్లీ ఓ సబ్జెక్టు రెడీ చేసుకుని యువి అధినేతల్ని కలిశాడు. ఇక్కడి నుంచి ప్రపోజల్ వరుణ్ దగ్గరికి వెళ్లింది. అతను కూడా ఆమోద ముద్ర వేయడంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం వరుణ్ ‘వాల్మీకి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. త్వరలోనే వరుణ్-గాంధీ--యువి కలయికలో సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English