మహేష్‌తో మళ్లీ సినిమా.. అంతా బుస్సేనా?

మహేష్‌తో మళ్లీ సినిమా.. అంతా బుస్సేనా?

వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే అతడికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. కానీ ‘ఊపిరి’ సక్సెస్ చూసి, అతడి కథను నమ్మి ‘మహర్షి’ చేసే ఛాన్సిచ్చాడు మహేష్. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం వసూళ్లు మాత్రం బాగానే రాబడుతున్నట్లు పీఆర్వోల ప్రకటనల్ని బట్టి అర్థమవుతోంది. కంటెంట్ పరంగా చూస్తే ‘మహర్షి’ చాలా సాధారణంగా అనిపిస్తుంది.

అనేక సినిమాల్ని కలిపి తయారు చేసిన కిచిడి చిత్రంగా దీన్ని చెప్పొచ్చు. కానీ వంశీ మాత్రం తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటి తీసిన ఫీలింగ్‌లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. ప్రమోషన్లలో, ఇంటర్వ్యూల్లో ఎక్కడ చూసినా సినిమా గురించి ఓ రేంజిలో చెబుతున్నాడు. ‘క్లాసిక్’, ‘ఎపిక్’ లాంటి పదాలు వాడకుండా ఈ కార్యక్రమాన్నీ ముగించట్లేదు అతను.

మహేష్ సైతం వంశీ మీద ప్రశంసల జల్లు కురిపించేస్తున్నాడు. కంటెంట్, వసూళ్లు.. ఇలా ఏ రకంగా చూసుకున్నా మహేష్ కెరీర్లో ఇంతకంటే మెరుగైన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ అతను మాత్రం ఇదే తన కెరీర్ బెస్ట్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ‘మహర్షి’కి జరిగినంత పోస్ట్ రిలీజ్ ప్రచార హడావుడి, విజయ సంబరాలు ‘బాహుబలి’ లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌కు జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రచారంలో భాగంగానే ఒక రూమర్ హల్ చల్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్-వంశీ కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతోంది అన్నదే ఆ రూమర్. మహేష్ త్వరలో అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మళ్లీ వంశీతో సినిమా చేస్తాడని ప్రచారం చేస్తున్నారు.

కానీ పరశురామ్, త్రివిక్రమ్ లాంటి వాళ్లు లైన్లో ఉండగా వాళ్లను కాదని వంశీతో మహేష్ ఇంత తక్కువ వ్యవధిలో ఇంకో సినిమా చేస్తాడంటే నమ్మశక్యంగా లేదు. ఒక మూసలో కొట్టుకుపోతున్నాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మహేష్.. రొటీన్ సినిమాలు తీసే వంశీతో సమీప భవిష్యత్తులో జట్టు కడతాడని అనుకోలేం. ఐతే ‘మహర్షి’ ప్రచార హోరులో భాగంగానే ఈ రూమర్ క్రియేట్ చేసి వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English