‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ అందుకోగలరా?

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ అందుకోగలరా?

రాజమౌళి సినిమాలంటే అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కావడం, రిలీజ్ డేట్‌ను అందుకోవడం కష్టమే. ఒకప్పుడు మామూలు సినిమాలు చేసినప్పటి సంగతి పక్కన పెట్టేస్తే.. రాజమౌళి చేసిన మెగా ప్రాజెక్టులేవీ కూడా ముందు చెప్పిన రిలీజ్ డేట్‌ను అందుకోలేకపోయాయి. ‘మగధీర’ నుంచి ‘బాహుబలి: ది కంక్లూజన్’ వరకు ఇదే జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆయన కొత్త సినిమా విషయంలోనూ ఇదే జరిగేలా ఉంది. గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్ సందర్భంగా.. వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డేట్ పక్కానా అని అడిగితే.. పక్కా అన్నట్లే మాట్లాడాడు జక్కన్న. దీనిపై మళ్లీ ప్రశ్నిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ 2020లో సినిమా రిలీజవుతుందని అన్నాడాయన.

ఐతే ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జులై 30కి రావడం సందేహమే అనిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మొదట్లో చురుగ్గానే సాగింది కానీ.. నెల రోజులగా షెడ్యూళ్లు తేడా కొట్టేశాయి. ముందుగా రామ్ చరణ్ గాయపడి మూడు వారాలకు పైగా షూటింగ్‌కి దూరమయ్యాడు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సైతం గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. మొత్తంగా నెల రోజుల దాకా షూటింగ్ డేస్ అటు ఇటు అయ్యాయి. నటీనటులు, టెక్నీషియన్ల డేట్లు ఈ మేరకు తారుమారు అయ్యాయి. ఈ ప్రభావం తర్వాతి షెడ్యూళ్లపై కచ్చితంగా పడుతుంది. కాబట్టి ముందు అనుకున్న డెడ్ లైన్‌ను అందుకోవడం అంత సులువు కాదు. రాజమౌళి సినిమా అంటే భారీతనంతో కూడుకున్నది. ఎంత పర్ఫెక్టుగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ వెళ్లినా కూడా చివరి దశలో ఏదో ఒక తేడా వస్తుంటుంది. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’కు ఆరంభంలోనే ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి వచ్చే ఏడాది జులై 30న ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందా అన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English