సమంత.. గిన్నిస్ బుక్ అంటున్న మామ

సమంత.. గిన్నిస్ బుక్ అంటున్న మామ

సినిమాల్లో తన కోడలు సమంత జోరు చూసి మురిసిపోతున్నాడు అక్కినేని నాగార్జున. పెళ్లయ్యాక కూడా ఏమాత్రం సమంత ఊపు తగ్గకపోవడం.. వేర్వేరు భాషల్లో వరుసగా విజయాలు అందుకుంటుండటం పట్ల నాగ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. వేసవిలో చాలా తక్కువ వ్యవధిలో సమంత మూడు హిట్లు కొట్టిందని.. ఇప్పుడు చూస్తే వినాయక చవితికి ‘యు టర్న్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోందని.. అలాగే తమిళంలో ఆమె కథానాయికగా నటించిన ‘సీమ రాజా’ కూడా విడుదల అవుతోందని.. ఇదంతా చూస్తే సమంతను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించాలేమో అనిపిస్తోందని నాగ్ అన్నాడు. ‘యు టర్న్’ ట్రైలర్ చూస్తే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందని.. ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నాగ్ ఆకాంక్షించాడు.

‘యు టర్న్’ దర్శకుడు పవన్ కుమార్ ఇంతకుముందు క్రౌడ్ ఫండింగ్‌తో ‘లూసియా’ సినిమా తీసి సక్సెస్ సాధించాడని.. ఆ సినిమా తనకెంతో నచ్చిందని.. దీని తర్వాత కన్నడలోనే తీసిన ‘యు టర్న్’ ట్రైలర్ చూశానని.. అది చాలా ఆసక్తికరంగా అనిపించిందని నాగ్ చెప్పాడు. వెంటనే సమంతకు ఫోన్ చేసి ట్రైలర్ బాగుంది కదా అన్నానని.. వెంటనే సమంత తన దగ్గరికి వచ్చి ఈ చిత్ర కథ చెప్పడం మొదలుపెట్టిందని.. దీంతో ఏం జరుగుతోందో తనకు అర్థం కాలేదని.. ఆమె ఈ చిత్ర రీమేక్‌లో నటించబోతోందని తర్వాతే తెలిసిందని నాగ్ చెప్పాడు. నాగచైతన్య, సమంతల సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని.. అలాగే ఇదే నెలలో తన సినిమా ‘దేవదాస్’ కూడా వస్తోందని.. దీంతో ఈ నెల తమకెంతో ప్రత్యేకమని.. అందరం సక్సెస్ సాధిస్తామని ఆశిస్తున్నామని నాగ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు