నాగబాబు కూతురిని దత్తత అడిగాడట

నాగబాబు కూతురిని దత్తత అడిగాడట

టాలీవుడ్లో ప్రస్తుతం మాంచి ఊపుమీదున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మురళీ శర్మ ఒకరు. ‘అతిథి’లో విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మురళీ శర్మ.. ఆ తర్వాత పాజిటివ్ క్యారెక్టర్ల వైపు అడుగులేశారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఆయన దశ తిరిగింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారాయన. ఇటీవలే వచ్చిన ‘విజేత’లో హీరో తండ్రి పాత్రలో మురళీ శర్మ ఎంత అద్భుతంగా నటించాడో తెలిసిందే.

వచ్చే వారాంతంలో రాబోయే ‘హ్యాపీ వెడ్డింగ్’లోనూ ఆయన కీకల పాత్ర పోషించారు. ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అందరూ మురళీ శర్మను ఆకాశానికెత్తేశారు. హీరోయిన్ కొణిదెల నిహారిక మాట్లాడుతూ.. మురళీ శర్మను తనను సొంత కూతురిలా చూసుకున్నారని చెప్పింది. ఆయనతో నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని అంది. మురళీ శర్మకు తాను చాలా నచ్చేసి.. తనను దత్తత తీసుకుంటానని అన్నట్లుగా నిహారిక వెల్లడించింది. ఒక సీన్లో మురళీ శర్మతో నటించాక తనకు కన్నీళ్లు వచ్చేశాయని.. బోరున ఏడ్చేశానని నిహారిక వెల్లడించింది.

మరోవైపు అల్లు అరవింద్ సైతం మురళీ వర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయన, నరేష్ ఏదైనా సినిమాలో ఉంటే మిగతా వాళ్లకు ఛాన్సివ్వకుండా నమిలి తినేస్తున్నారని అరవింద్ అన్నాడు. ఈ మధ్య మురళీ శర్మ నటించిన ఓ సినిమా చూసి తాను ఆశ్చర్యపోయానని.. అతిశయోక్తి అనుకోకపోతే ఎస్వీ రంగారావు అవార్డు ఏదైనా ఉంటే అది మురళీ శర్మకే ఇవ్వాలన్నది తన అభిప్రాయమని.. క్యారెక్టర్ రోల్స్‌ను ఆయన అంత గొప్పగా పండిస్తున్నారని అరవింద్ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు