పవన్‌తో అకీరా.. రేణు స్పందించింది

పవన్‌తో అకీరా.. రేణు స్పందించింది

విజయవాడ పర్యటనలో ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన కొడుకు అకీరా నందన్ కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో పవన్ ప్రస్తుత భార్య అనా లెజ్‌నెవా కూడా ఉంది. పవన్ నుంచి రేణు విడిపోయాక అకీరా ఆమె దగ్గరే పుణెలో ఉంటున్నాడు. అతను హైదరాబాద్ రావడం అరుదు. వచ్చినా తల్లితో పాటే వస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు అనాతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్న పవన్ పక్కన అకీరా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అకీరా హీరో అయ్యే ప్రయత్నంలో ఉన్నాడని.. దీంతో తండ్రి దగ్గరికి వచ్చేశాడని.. హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. ఈ విషయంలో రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో జనాలు ఆరాతీయడం మొదలుపెట్టారట.

నిన్నట్నుంచి అదే పనిగా అందరూ ఈ విషయమై అడుగుతుండటంతో రేణు నోరు విప్పింది. అకీరాకు ఇప్పుడు సెలవులని.. అందుకే తన తండ్రి దగ్గరికి వెళ్లాడని.. అంతే తప్ప అతనేమీ హైదరాబాద్ కు మకాం మార్చేయలేదని రేణు స్పష్టం చేసింది. అందరూ తనను దీని గురించి అడుగుతుండటంతో స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. పవన్ నుంచి విడిపోయాక చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్న రేణు.. ఇటీవలే తాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న సంకేతాలు ఇచ్చింది.

ఇలాంటి టైంలోనే అకీరా.. పవన్‌తో కలిసి కనిపించేసరికి ఆసక్తికర చర్చ మొదలైంది. పవన్ పిల్లలు అతడి దగ్గరికే వచ్చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే రేణు చెప్పిందాన్ని బట్టి అకీరా తాత్కాలికంగానే ఇక్కడికి వచ్చాడన్నమాట. మరి ఆమెకు పెళ్లయ్యాక అకీరా, ఆద్య ఎక్కడ ఉంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు