థియేటర్ల కోసం కొట్లాట తప్పదా?

థియేటర్ల కోసం కొట్లాట తప్పదా?

గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి సందడి అంతగా ఉండకపోవచ్చనే అనుకున్నారు కొన్ని రోజుల కిందటి వరకు. ఈ పండక్కి పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’.. బాలయ్య మూవీ ‘జై సింహా’ మాత్రమే కన్ఫమ్ అయ్యాయి. తెలుగు నుంచి మరే సినిమా పోటీకి రాలేదు. తమిళ డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’ కూడా సంక్రాంతికే షెడ్యూల్ అయినప్పటికీ.. పండగలకు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయకూడదనే షరతు ఉన్న నేపథ్యంలో దీని విడుదల ఆగిపోతుందేమో అన్న సంశయాలు కలిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను పవన్, బాలయ్య సినిమాల నిర్మాతలు డిమాండ్, క్రేజ్‌ను బట్టి పంచుకుంటారని భావించారు.

కానీ ఇప్పుడు సీన్ మారింది. ‘గ్యాంగ్’ సినిమా కూడా సంక్రాంతికే కన్ఫమ్ అయింది. ఆ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ.. అల్లు అరవింద్ లాంటి మరో పెద్ద నిర్మాత ఈ చిత్రానికి అండగా నిలుస్తున్నారు. వాళ్లిద్దరూ కలిసి ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లను సాధించే ప్రయత్నంలో ఉన్నారట. మరోవైపు అక్కినేని నాగార్జున తన నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగుల రాట్నం’ సినిమాను లేటుగా సంక్రాంతి రేసులోకి తెచ్చాడు. ఆయనకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లపై పట్టుంది. తన పరిచయాలతో మరిన్ని స్క్రీన్లు సంపాదించే పనిలో పడ్డాడు. ఇక ఆకాశాన్నంటే అంచనాల మధ్య రిలీజవుతున్న ‘అజ్ఞాతవాసి’కి ఆల్రెడీ భారీగా స్క్రీన్లు బుక్ అయి ఉన్నాయి. తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా పదో తారీఖున రెండు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమానే వేసేస్తున్నారు.

ఐతే ‘జై సింహా’ వచ్చే రోజుకు తకరారు తప్పకపోవచ్చు. ఆ సినిమాకు చాలినంత స్థాయిలో థియేటర్లు ఇవ్వాలనే గొడవ మొదలు కావచ్చు. అదే సమయంలో ‘గ్యాంగ్’.. ‘రంగుల రాట్నం’ సినిమాలకు థియేటర్లు చాలినన్ని ఇవ్వడమూ సమస్యే. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఒక్కోదానిది ఒక్కో రేంజ్. ఐతే పండగ సమయంలో వసూళ్లు అంచనాలకు మించి ఉంటాయి కాబట్టి దేనికి స్క్రీన్లు తగ్గినా  వసూళ్లూ ఆ మేరకు తగ్గిపోతాయి. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్లు థియేటర్ల కోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. మరి వీరిలో ఎవరు ఎంత మేరకు సక్సెస్ అవుతారో.. ఆయా సినిమాలు రిలీజయ్యే సమయానికి ఎలాంటి గొడవలు తలెత్తుతాయో చూడాలి.