ఈసారి విక్రమ్ హీరో.. అతను విలన్

ఈసారి విక్రమ్ హీరో.. అతను విలన్

గత పుష్కర కాలంలో విక్రమ్ నుంచి ఎన్ని ఫ్లాపులు వచ్చాయో లెక్కే లేదు. ఈ ఫ్లాపులన్నింట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'విలన్' గురించే. ఈ చిత్రం విక్రమ్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమా అవుతుందని అనుకుంటే.. ఆయన కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటైంది. 'విలన్'లో విక్రమ్ నెగెటివ్ రోల్ చేయగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరో పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఐతే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. విక్రమ్ హీరో అవతారంలో కనిపించబోతుంటే.. పృథ్వీరాజ్ విలన్ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధృవనక్షత్రం'లో వీళ్లిద్దరినీ ప్రత్యర్థులుగా చూడబోతున్నాం.

'ధృవ నక్షత్రం' సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన రెండు టీజర్లకూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో విక్రమ్ విలన్‌తో జరిపే సంభాషణను గమనించే ఉంటారు. అవతలి వైపు వినిపించే వాయిస్ పృథ్వీరాజ్‌దేనట. మలయాళంలో పెద్ద హీరో అయిన పృథ్వీరాజ్.. ఆల్రెడీ బాలీవుడ్లో విలన్ అవతారం ఎత్తాడు. తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నామ్ షబానా'లో అతనే విలన్. ఇప్పుడు తమిళులకు హీరోగానే పరిచయమున్న పృథ్వీ.. అక్కడి వాళ్లను కూడా విలన్‌గా పలకరించబోతున్నాడు.

విక్రమ్-గౌతమ్ కాంబినేషనే ఆసక్తి రేకెత్తించేదంటే.. ఇందులో పృథ్వీరాజ్ విలన్ అనగానే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. గౌతమ్ చేసిన యాక్షన్ సినిమాలన్నింట్లో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పృథ్వీరాజ్ పాత్ర కూడా అలాగే ఉంటుందేమో చూడాలి. ఈ చిత్రం తమిళ.. తెలుగు భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు