రిలీజ్ డేట్ల ర‌గ‌డ త‌ప్పేలా లేదు


క‌రోనా భ‌యం పోయి.. టాలీవుడ్ బాక్సాఫీస్ రీస్టార్ట్ అయి.. ఆశావ‌హ ప‌రిస్థితులు క‌నిపించ‌గానే టాలీవుడ్ నిర్మాత‌లు త‌మ సినిమాల రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించ‌డానికి ఎలా పోటీ ప‌డ్డారో తెలిసిందే. మునుపెన్న‌డూ లేని విధంగా కొన్ని రోజుల వ్య‌వ‌ధిలో ప‌దుల సంఖ్య‌లో కొత్త సినిమాల విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించారు. ఏకంగా ఏడాది త‌ర్వాతి రావాల్సిన సినిమాల‌కు కూడా ఇప్పుడే డేట్లు ఇచ్చేయ‌డం విశేషం. అప్ప‌టికి నిజంగా సినిమాలు రిలీజ్ చేస్తామో లేదో.. ముందైతే డేట్లు ఇచ్చేద్దాం అన్న‌ట్లుగా పోటీ ప‌డ్డారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు చాలా సినిమాలు అనుకున్న డేటుకు రావ‌డం క‌ష్టంగానే ఉంది. షూటింగ్ ఆల‌స్యానికి తోడు.. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు చాలా సినిమాలు వాయిదా ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ వారం నుంచి ఒక్కో సినిమా వాయిదా ప‌డ‌టం మొద‌లైంది.

ఇప్ప‌టికే ల‌వ్ స్టోరి, ట‌క్ జ‌గ‌దీష్‌, విరాట‌ప‌ర్వం ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వాయిదా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాయి. మున్ముందు మ‌రిన్ని సినిమాలు ఇదే బాట ప‌ట్ట‌నున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్‌కు భ‌య‌ప‌డుతున్నారా లేక ఏపీలో టికెట్ల రేట్ల నియంత్ర‌ణ నేప‌థ్యంలో ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేయ‌డం మంచిది కాద‌నుకుంటున్నారా తెలియ‌దు కానీ.. ఈ నెల‌లో రావాల్సిన మూడు క్రేజీ సినిమాలు వాయిదా ప‌డిపోయాయి. వ‌చ్చే నెల‌లో రావాల్సిన ఆచార్య‌, నారప్ప సినిమాలు కూడా షెడ్యూల్ ప్ర‌కారం రిలీజ్ కావ‌డం సందేహంగానే ఉంది.

ఐతే ఈ సినిమాల‌న్నీ డేట్లు మార్చుకుని వెన‌క్కి వెళ్ల‌డంతో.. త‌ర్వాతి రోజుల‌కు షెడ్యూల్ అయిన సినిమాలతో క్లాష్ త‌ప్పేలా లేదు. ఆ సినిమాలు అనుకున్న ప్ర‌కారం సిద్ధం అయితే ఇప్పుడు ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ముఖ్యంగా జూన్ నెల‌లో రిలీజ్ డేట్ల కోసం కొట్లాట త‌ప్పేలా లేదు. మొత్తానికి మున్ముందు టాలీవుడ్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు త‌ప్పేలా లేవు.