తప్పులో కాలేసిన ఐ ప్యాక్.. జగనన్న బండబూతులు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనూహ్య ఫలితాలనిచ్చాయి. వైసీపీని చావు దెబ్బ కొట్టాయి. ఫలితాలను చూసి అధికార పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మితిమీరిన ఆత్మవిశ్వాసమా.. లెక్క తప్పిందా అర్థం కాక నేతలు తల పట్టుకుంటున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలో మూడింటికి మూడు ఓడిపోవడం దేనికి సంకేతమన్న విశ్లేషణ కూడా మొదలైంది. అంచనా ఎక్కడ తప్పిందో వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు..

వైసీపీకి వ్యూహకర్తగా ఉండే ఐ ప్యాక్ కూడా తప్పు చేసినట్లుగా భావిస్తున్నారు. ఐ ప్యాక్ ఒక చోట టార్గెట్ చేస్తే దెబ్బ మరోచోట పడిందని చెబుతున్నారు. వైసీపీ మొదటి నుంచి కూడా టీచర్లు, ఉద్యోగులు తమకు దూరమేనన్న ఆలోచన ఉంది. ఆ రెండు వర్గాలకు తమపై పీకల్లోతు కోపముందని అర్థం చేసుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఐ ప్యాక్ వ్యూహాలు పన్నింది. అక్కడ ఐ ప్యాక్ వ్యూహం ఫలించిందని చెప్పక తప్పదు. కాకపోతే అసలు డ్యామేజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దగ్గర జరిగింది.

డబ్బులిచ్చి ఓటర్లను కొనడం, పోలింగ్ లో అవకతవకలు చేయడం ద్వారా కొన్ని వందల ఓట్లను సాధిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచిపోవచ్చని ఐ ప్యాక్ సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఓటర్లను ఏకమొత్తంగా తమ వైపుకు తిప్పుకునే వ్యూహం అసలు వారి అలోచనకే రాలేదు. విద్యాధికులు సైతం జగన్ పై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని, వారిని ఆకట్టుకునేందుకు ఏదోటి చేయాలన్న ఆలోచన ఐ ప్యాక్ వ్యూహకర్తల మదిలో మెదలలేదు. ఆ సంగతి వైసీపీకి వాళ్లు చెప్పలేదు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలో గెలిచే స్పష్టమైన వ్యూహాన్ని ఐ ప్యాక్ అమలు చేయలేదు..దానితో బొక్కా బోర్లా పడి, మూడు ఎమ్మెల్సీల్లో ఘోరపరాజయం తప్పలేదు. దీని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని, టీడీపీ ఇకపై రెచ్చిపోతుందని ఐ ప్యాక్ వర్గాలే అంగీకరిస్తున్నాయి..

జగన్ ఆగ్రహం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి తర్వాత ఐ ప్యాక్ టీమ్ తో జగన్ సమావేశమైనట్లుగా చెబుతున్నారు. ఇంత చిన్న ఎన్నికను కూడా మేనేజ్ చేయలేకపోతే మీ వ్యూహాలు ఎందుకని ఆయన నిలదీసినట్లు తెలుస్తోంది. అడిగినన్ని నిధులు సమకూరుస్తున్నప్పుడు సక్రమంగా పనిచేసి పార్టీకి వంద శాతం విజయం అందించాలి కదా అని జగన్ అడుగుతుంటే ఐ ప్యాక్ బృందం నీళ్లు నమిలిందంటున్నారు. ఇలాగైతే వేరు దారి చూసుకోవాల్సి వస్తుందని కూడా జగన్ హెచ్చరించినట్లు చెబుతున్నారు..

కొసమెరుపు

గతంలో ఉత్తరాదిన ఒక జోక్ ఉండేది. గెలిచే పార్టీకే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తాడని చెప్పేవారు. మరి ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.