కొడాలి, వంశీలను చంపండి.. 50 ల‌క్ష‌లిస్తా: తెలంగాణ నేత వ్యాఖ్య‌లు

ఏపీకి చెందిన వైసీపీ నాయ‌కులు, కీల‌క మంత్రి కొడాలి నాని, కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీల‌ను చంపితే.. 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తాన‌ని తెలంగాణ‌కు చెందిన కీల‌క నేత ఒక‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా ఉన్న మ‌ల్లాది వాసు.. చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌దంగా మారాయి. ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మంత్రి కొడాలి, ఎమ్మెల్యే వంశీలు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో తాజాగా వాసు ఈ వ్యాఖ్య‌లుచేయ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఖ‌మ్మంలో జ‌రిగిన క‌మ్మ సామాజిక వ‌న స‌మారాధాన‌లో  కౌన్సిల్ మ‌ల్లాది వాసు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం కమ్మ కుల‌స్తుల‌కు రెండురాష్ట్రాల్లోనూ ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. అన్నారు. మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంపై కొంద‌రు.. ఉద్దేశ పూర్వ‌కంగా దాడులు చేస్తున్నార‌ని.. అన్నారు. దీనిలో భాగంగానే కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటివారు రెచ్చిపోతున్నార‌ని అన్నారు. ఇలాంటి వారికి త‌గిన బుద్ధి చెప్ప‌డం కాద‌ని.. వీరిని అంతమొందించాల‌ని అన్నారు.

గ‌తంలో అనంతపురం జిల్లాకుచెందిన ప‌రిటాల ర‌వి ఉన్న‌స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గానికి ఎంతో విలువ ఉండేద‌ని.. ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని అన్ని విధాలా ఆదుకున్నార‌ని తెలిపారు. అయితే.. ప‌రిటాల ర‌విని మొద్దు సీనుతో హ‌తమార్చార‌ని.. దీనివెనుక కూడా కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ప‌రిటాల ర‌వి జీవించి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌మ్మ‌ల ప‌రిస్థితి ఇలా ఉండేది కాద‌ని అన్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి శ‌త్రువులుగా మారిన‌.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను హ‌త‌మార్చే వారికి తాను 50 ల‌క్ష‌ల రూపాయ‌ల నజ‌రానా ఇస్తాన‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోస‌ల్ మీడియాలో సంచ‌ల‌నం రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.