ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్. దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఓ వెలుగు వెలిగింది. కానీ ఆ తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. సీనియర్ల ఆధిపత్యం.. పదవులు పోరు.. ఇలా వివిధ కారణాలతో పార్టీ ప్రతిష్ట మసకబారింది. ఇక ఉమ్మడి ఏపీని విభజించి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేసిన తర్వాత ఏపీలో పార్టీ కనుమరుగైపోగా.. తెలంగాణాలో మాత్రం ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ నాయకులు విఫలమయ్యారు. దీంతో వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు.
కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఆ పార్టీ తిరిగి జోరు కొనసాగిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైన తర్వాత రాష్ట్రంలో వాతమొచ్చిన చేతికి ఊతమిచ్చేలా దూసుకెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తూనే మరోవైపు సభలు ర్యాలీలు అంటూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపుతున్నారు. కానీ పార్టీలో అంతా సర్దుకుంటుంది అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరోసారి పార్టీలో విభేదాలకు కారణమైంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయని తెలుస్తోంది.
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఫలితంపై పూర్తి బాధ్యత తనదే అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీలో సీనియర్లకు స్వేచ్ఛ ఉంటుందని వాళ్లేమైనా మాట్లడగలరని కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా తనకు కొన్ని పరిమితులుంటాయని రేవంత్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఎన్నికలో బల్మూరి వెంకట్‌ను రేవంత్, భట్టి విక్రమార్క కలిసి బలి పశువును చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థిని ముందుగానే ఎందుకు ప్రకటించలేదని, తనకు తెలీకుండానే బల్మూరి పేరును ఫైనల్ చేశారని ఈ ఎన్నికలో పార్టీ విజయం కోసం రేవంత్ ఏమీ చేయలేదని జగ్గారెడ్డి అన్నారు. ఒకవేళ ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన ఫలితాలు సాధిస్తే అది రేవంత్ ఖాతాలో చేరేదని, కానీ ఇప్పుడు రేవంత్ సరిగా ప్రచారం చేయకపోవడం వల్లే పార్టీకి ఓట్లు రాలేవని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. డబ్బులు పంచకుండా ఎన్నికల్లో ఎలా గెలుస్తామని రేవంత్ ఒక్క పైసా కూడా పెట్టలేదని జగ్గారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితర సీనియర్ నేతలు కూడా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి రేవంత్ రెడ్డి కారణమనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం వాడివేడిగా సాగే అవకాశం ఉంది. మొదటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎంపికను వ్యతిరేకిస్తున్న పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం రేవంత్‌పై వాళ్ల అసహనాన్ని వెళ్లగక్కేందుకు అవకాశం ఇచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. నాయకులందరూ కలిసి పనిచేస్తేనే పార్టీకి పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఎవరిని నచ్చినట్లు వాళ్లు ఉండడం.. ఒక్కతాటిపైకి రాకపోవడంతో పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి హుజూరాబాద్ దెబ్బతో రేవంత్ దూకుడు ఆగుతుందా? లేదా నాయకులందరినీ దారిలోకి తెచ్చుకుని ఆయన ముందుకు సాగుతారా? అన్నది చూడాలి.
This post was last modified on November 4, 2021 10:29 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…