ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్న కొందరు చేస్తున్న వ్యవహారం.. ప్రబుత్వానికి తలనొప్పి గా మారిందా? వీరంతా సీనియర్లు కావడం.. చేస్తున్న పనులు విమర్శలకు దారితీయడం.. తాజాగా మరోసారి మంత్రులపై చర్చకు దారితీసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. కరోనా తర్వాత.. ఆర్థిక పరిస్థితి కూడా భారంగా మారింది. మరోవైపు సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ఆలస్యం వంటివి ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ సమయంలో పనితీరును మెరుగు పరుచుకోవాల్సిన మంత్రులు.. ఎవరికి వారుగా వ్యవహరించడం.. విమర్శలకు దారితీస్తోంది.
సీనియర్ నాయకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. గ్రానైట్ క్వారీలు, అక్రమైనింగ్, ఎర్రచందనం వంటి విషయాలు ఆయన చుట్టు తిరుగుతున్నాయి. ఏ విషయాన్ని ప్రస్తావించినా.. ప్రతిపక్షాల కుట్ర అంటూ.. ఆయన తేలికగా తీసుకుంటున్నారని.. ఆరోపణలు వస్తున్నాయి. పైగా మరో నాలుగు నెలల తర్వాత.. తన పదవి ఉంటుందో ఊడుతుందో.. అనే బెంగ కూడా ఆయనను ఆవరించడంతో అసలు ఆయన తటస్థంగా మారిపోయారని.. అంటున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి బంధువు అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు పెరిగి (ట్రూ అప్ చార్జీలు) ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వ విధానాన్ని ఎందుకు చార్జీలు పెంచాల్సి వచ్చిందో చెప్పి.. ప్రజల ఆగ్రహాన్ని సర్దు బాటు చేయాల్సిన ఈయన రష్యాటూర్‌కు వెళ్లారు. అది విమర్శలకు తావిచ్చింది. సొంత ఖర్చుపైనే వెళ్లినా.. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితిలో ఆయన ఇలా వ్యవహరించడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి విజయం దక్కించుకుని.. తొలిసారి మంత్రి అయిన వెలంపల్లి శ్రీనివాస్.. దేవదాయ శాఖ చూస్తున్నారు. అయితే.. ఈ శాఖ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఉన్నతాధికారిపై మరో అధికారి ఇసుక పోసిన వివాదం ఇప్పటికీ శాఖలో విమర్శలు వచ్చేలా చేస్తూనే ఉంది. ఉద్యోగులపై పట్టు లేదనే అభిప్రాయం వెల్లడవుతోంది. పైగా సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే ఆయన విభేదిస్తున్నారని ప్రచారంలో ఉంది. వెరసి.. ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. కేవలం తన వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం రాజకీయాలకు కొత్తకాదు. అదేసమయంలో వివాదాలే కేంద్రంగా ఆయన అడుగులు వేస్తున్నారు. గతంలో తన కుమారుడికి బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారనే ఆరోపణలు వున్నాయి. ఇది అవినీతి క్రమంలో అందిన ముడుపుగానే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణాలో ఓ పోలీస్ అధికారిని ఆయన బెదిరించారని వార్తలు వచ్చాయి. దీనిపై కేసు కూడా నమోదైంది. మరి ఈయన వల్ల పార్టీకి ఏం ప్రయోజనం.. ప్రభుత్వానికి ఇంకేం ఉపయోగం అనే మాట వినిపిస్తుండడం గమనార్హం.
పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొంది మంత్రి కొడాలి నాని.. వ్యవహారం యూటర్న్ తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాలో దాదాపు 4 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు.. సొంత పార్టీ నేతలే.. ఆరోపణలు చేశారు. అయినా.. ఆయన స్పందించలేదు.
మరోవైపు.. విశాఖపట్నం భీమిలికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్.పైనా.. ఇటీవల కాలంలో విమర్శలు వస్తున్నాయి. విశాఖలో భూముల కబ్జా ఆరోపణలు పెరిగాయి. దీనికితోడు .. ఇటీవల ఓ మహిళ విషయంలో ఆయన జరిపినట్టుగా ప్రచారంలో ఉన్న ఫోన్ సంభాషణ మరింత మచ్చగా మారింది. దీనిపైనా కేవలం విచారణ చేస్తామని అన్నారే తప్ప.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పరిణామాలన్నీ.. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయనేది వాస్తవం. అయితే.. ఇప్పటి వరకు వీరు లైమ్‌లైట్‌లోనే ఉండడం గమనార్హం. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 6, 2021 6:53 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…