తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. సవాళ్లు.. ఛాలెంజ్‌లు.. రాజకీయ నేతల ఇళ్ల ముట్టడి.. ఇలా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అందుకు ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కొన్నాళ్లుగా తెలంగాణ ఆధిపత్యం చలాయిస్తున్న సీఎం కేసీఆర్‌కు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఈ ఇద్దరు కొరకరాని కొయ్యలా మారారు. ముఖ్యంగా రేవంత్ యమ జోరు మీదున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరో కొత్త వ్యూహానికి తెర తీసారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాది వరకూ తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి సంబంధించిన ప్రస్తావన పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పార్టీతో కాంగ్రెస్, బీజేపీ ఢీ కొడుతున్నాయి. టీఆర్ఎస్‌తో తలపడే పార్టీల్లో ఎక్కువగా కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటాయి. కానీ ఇప్పుడు రేవంత్.. కేసీఆర్ తనయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేసుకున్నారు. రాజకీయ రణక్షేత్రంలో దూకుడుతో సాగుతున్నారు. టీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో రేవంత్ కాస్త భిన్నంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నిర్ణయాల్లో కేసీఆర్‌దే కీలక పాత్ర. కానీ భవిష్యత్‌లో మాత్రం కేటీఆర్ హవానే సాగడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఈ విషయంలో ఓ స్పష్టతతో ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. దీంతో భవిష్యత్ రాజకీయాల్లో తనకు పోటీ కేటీఆర్ అవుతారని భావించిన రేవంత్ ఇప్పటి నుంచే ఆయనతో తలపడేందుకు సిద్ధమయారు. అందుకే కేసీఆర్‌కు బదులు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే డ్రగ్స్ విషయంలో కేటీఆర్‌ను లాగి.. వైట్ ఛాలెంజ్ సవాలును విసిరారు. యువ రాజకీయ నేతగా ఎందరికో ఆదర్శంగా నిలవాల్సిన కేటీఆర్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని రేవంత్ కోరారు. అందుకు కేటీఆర్ కూడా దీటుగానే స్పందించారు. నోటుకు ఓటు కేసులో భాగంగా రేవంత్ లై డిటెక్టర్ పరీక్షకు హాజరైతే తానూ వైట్ ఛాలెంజ్ తీసుకుంటున్నాని ప్రతి సవాలు విసిరారు. అందుకు బదులుగా.. కేసీఆర్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమైతే.. తానూ అందుకు రెడీగా ఉన్నట్లు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
ఇక ఈ విషయంపై కోర్టుకు వెళ్లిన కేటీఆర్… డ్రగ్స్ కేసు విషయంలో తన పేరును రేవంత్ వాడకుండా ఉండేలా ఆదేశాలు తెచ్చుకోవడంలో విజయవంతమయారు. కానీ ఈ ఇద్దరు నాయకుల మధ్య ఈ పోరు మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్‌ను ఎదుర్కొనే విషయంలో కేటీఆర్ తడబడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ వ్యూహాలకు ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఈ పోరు మరెంత దూరం వెళ్తుందో చూడాలి.
This post was last modified on September 22, 2021 12:58 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…