నువ్వు ఒకటి అంటే.. నేను రెండు అంటా. నువ్వు రెండు అంటే.. నాలుగు అనేస్తా అన్నట్లుగా ఉంది వైసీపీకి చెందిన ఇద్దరు నేతల పరిస్థితి. ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వర్సెస్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా వారిద్దరు హద్దులు మీరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటమే కాదు.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. వారి మాటలయుద్దంలో సవాళ్లు.. ప్రతిసవాళ్లు చోటు చేసుకోవటం విశేషం. వారి మాటల యుద్ధంలో జంతువులను ప్రస్తావిస్తూ తిట్టేసుకోవటం గమనార్హం.
ఎంపీ రఘురామకృష్ణరాజు బ్లాక్ షీప్ అంటూ విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. ‘‘కొమ్ములు లేని దున్నపోతు రఘురామరాజు. ఆయనకు సిగ్గుంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారారు. సీఎం జగన్‌ను మొదలుకొని వైసీపీ నేతలపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. రఘురామ ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సందర్భాలు లేకపోలేదు’’ అని మండిపడ్డారు.
దీనికి అంతే తీవ్రంగా స్పందించారు ఎంపీ రఘురామ రాజు. పెద్ది రెడ్డి గోముఖ వాఘ్రమని.. ఆయన్ను నమ్మితే సీఎం జగన్ నష్టపోతారన్నారు. తాను పెద్దిరెడ్డి సవాలుకు సిద్ధమన్న ఆయన.. ప్రతి సవాల్ విసిరారు. తాను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ ఎమ్మెల్యేల్ని గెలిపించుకోవాలన్నారు. అప్పుడు పెద్దిరెడ్డి సవాలుకు సిద్ధమన్నారు. ‘‘నా కాళ్లు పట్టుకొని బతిమాలితే నేను జగన్ పార్టీలో చేరాను. నేను గనుక సీఎం అయితే అన్న నీ మాటల వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలి. మీ సీఎం అసమర్థుడా? చేతకాని వాడా? సమాధానం చెప్పు. చంద్రబాబుకు నేను బంట్రోతుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా నాకు చంద్రబాబు ఉన్నత స్థానం ఇచ్చారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదు. నా గెలుపునకు వైఎస్ విజయమ్మ, షర్మిల, జగన్ ఫొటోలు ఉంటే నా వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడైంది. నేను సీఎం జగన్‌ను ఎప్పుడూ విమర్శించలేదు. ప్రభుత్వ పాలసీలను, విధానాలను, తప్పుచేస్తున్న వారిని మాత్రమే విమర్శించా’’ అని ఫైర్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డిల దయవల్ల నువ్వు మంత్రి అయ్యావని మండిపడ్డ నరసాపురం ఎంపీ.. మంత్రి పెద్దిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ఇసుక ద్వారా ఎన్నివేల కోట్లు సంపాదిస్తున్నావో ప్రజలకు తెలుసు. నాపై ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నందునే బీజెపీతో దగ్గరవుతున్నట్లు ఒక పెద్దరెడ్డి సీఎంకు చెప్పారట. అలాగైతే సీఎంపై 33 చార్జిషీట్లు ఉన్నాయి. అందుకే ఆయన బీజెపీకి దగ్గరగా ఉన్నట్టా? ఆ పెద్దరెడ్డి నన్ను విమర్శిస్తూ పరోక్షంగా సీఎంను అవమానిస్తున్నారు’’ అంటూ ఫైర్ అయ్యారు. మరి.. ఈ ఇద్దరి నోళ్లకు సీఎం జగన్ ఎలా తాళాలు వేస్తారో చూడాలి.
This post was last modified on March 13, 2021 10:00 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…