దేశంలో మొదటిసారి హైదరాబాద్ లో శనివారం గిగ్ వర్కర్ల సంక్షేమ సభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది గిగ్ వర్కర్లు వున్నారు.
వారి కోసం ప్రత్యేక సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి కార్మికుడికి ఒక యూనిక్ ఐడీ నంబర్ తో కూడిన ఐడి కార్డును జారీ చేశారు. ఈ సందర్బంగా సభకు ముందు మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక నుంచి హెచ్ఐసీసీ మీదుగా జయభేరి గ్రౌండ్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ ఒక మహిళా గిగ్ వర్కర్ స్కూటీపై ప్రయాణించారు.
అయితే రాహుల్ గాంధీ వాహనానికి కొద్ది దూరంలో మహేష్ కుమార్ గౌడ్ పరుగెత్తుతూ కనిపించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ విషయం గురించి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పించాయి. ఒక పీసీసీ అధ్యక్షుడైవుండి రాహుల్ గాంధీ వెనకాల పరుగులు తీయడమేంటని, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్‌కు తగిన గౌరవం లభించడం లేదని సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీలు విరుచుకొని పడ్డాయి. ఇది కాంగ్రెస్ నాయకుల బానిసత్వ మనస్తత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విమర్శలపై మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు. ర్యాలీలో తాను ఎందుకు పరుగెత్తాల్సి వచ్చిందో వివరించారు. ర్యాలీ సమయంలో తాను ఎక్కిన బైక్ స్కిడ్ అయ్యిందని, మరో బైక్ ఎక్కే క్రమంలో కాన్వాయ్ కంటే కొంచెం వెనకబడిపోయానని ఆయన తెలిపారు.
పక్కన తాను కనిపించకపోవడంతో రాహుల్ గాంధీ తనను పిలిచారని, అందుకే వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన పక్కన చేరానని స్పష్టం చేశారు. అయినా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పక్కన నడవడం, పరుగెత్తడం తనకు దక్కిన మహద్భాగ్యమన్న ఆయన తాను పరుగెడితే ప్రతిపక్షాలకు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.
మహేష్ కుమార్ గౌడ్ రన్నింగ్ మీద నెటిజన్లు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. అయ్యా నువ్వు పరుగేత్తితే మాకేం బాధలేదు. ఒక పీసీసీ అధ్యక్షుడిగా పరుగెత్తడమే బాధగా వుందని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి పదవి కోసం తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకుల వద్ద తాకట్టు పెట్టొద్దని విమర్శలు గుప్పిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
