గిగ్ వర్కర్లకు వైఫై.. రెస్ట్ జోన్లు కూడా!

ఆన్‌లైన్ ఫ్లాట్ ఫార్మ్ నుంచి వ‌చ్చే ఆర్డ‌ర్ల‌ను ఇంటికి చేర్చే గిగ్ వ‌ర్క‌ర్స్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వారిని అక్కున చేర్చుకుంటామ‌ని తెలిపారు. శ‌నివారం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. గిగ్ వర్కర్ల సంక్షేమ సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. అనంత‌రం రాహుల్ మాట్లాడుతూ.. “మీరు వర్కర్లు కాదు, పార్ట్‌నర్స్. గిగ్ వర్కర్లను కేవలం కార్మికులుగా కాకుండా భాగస్వాములుగా గుర్తిస్తున్నా” అని వ్యాఖ్యానించారు.

గిగ్ వృత్తిని తీసుకున్న వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అండగా నిలుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతి గిగ్ వర్కర్‌కు ప్రమాద బీమా స‌హా లక్ష రూపాయ‌ల వ‌ర‌కు ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఎండలో తిరుగుతూ డెలివరీలు చేసే కార్మికులు సేదతీరేందుకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి నగరంలో వైఫై సౌకర్యంతో పాటు ప్ర‌తి 10 కిలో మీట‌ర్ల ప‌రిధిలో ప్రత్యేక రెస్ట్ జోన్లను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

అలాగే, గిగ్ వర్కర్లకు భవిష్యత్తులో పెన్షన్, ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి ట్రాన్సాక్షన్‌పై నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. గిగ్‌ వర్కర్ల సమస్యలు త‌న‌కు తెలుసున‌ని చెప్పిన ఆయ‌న‌.. వర్కర్లకు రక్షణ కల్పిస్తానని ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ త‌న‌కు ఇంకా గుర్తుంద‌న్నారు. గిగ్‌ వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామ‌ని రాహుల్ చెప్పారు. వీరి ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామ‌న్నారు. గిగ్‌ వర్కర్లకు రూ.10 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్ చేస్తున్నామ‌న్నారు. 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప్ర‌మాద బీమాను అందిస్తున్న‌ట్టు చెప్పారు.

కాంగ్రెస్‌ అంటేనే మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. రాహుల్‌ గాంధీ మాట ఇస్తే తప్పర‌ని వ్యాఖ్‌యానించారు. చాలా మంది అభిప్రాయాలను తీసుకుని చట్టం రూపొందించామ‌ని తెలిపారు. గిగ్ వ‌ర్క‌ర్ల ర‌క్ష‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం రూపొందించి అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇలా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మేన‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులోనూ గిగ్ వ‌ర్క‌ర్ల ర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌న్నారు.