ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ సహా కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు.. కూటమి పరాజయానికి దారి తీశాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో గంగాధర నెల్లూరులో వైసీపీ పుంజుకుంది. ఇది.. ఎమ్మెల్యే కారణంగానే జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
సమన్వయ లోపంతోపాటు ఎమ్మెల్యేపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా పరిషత్ ఎన్నికలలో దెబ్బ తీసిందని స్థానిక టీడీపీ వర్గం ఆరోపిస్తోంది. స్థానిక కూటమి నాయకులను, పాత క్యాడర్‌ను కలుపుకొని పోవడంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దీని ప్రభావం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలపై పడిందని, రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా నడుస్తున్నా జీడీ నెల్లూరులో మాత్రం వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఈ అంతర్గత విభేదాలే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆది నుంచి..
2024లో తొలిసారి థామస్ టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన తర్వాత కొద్ది కాలంలోనే విమర్శలకు కేంద్రంగా మారారు. సొంత కూటమి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేశారు. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, కేవలం గెలిపించుకోవడానికే ఎస్సీలు కావాలా.. అధికారంలో వాటా ఇవ్వకుండా తొక్కుతున్నారంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.
మట్టి, ఇసుక అక్రమ రవాణాపై వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీని సంకటంలోకి నెట్టింది. “ఒక్క జీడీ నెల్లూరులోనే కాదు, పక్కనే ఉన్న చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో కూడా మట్టి తరలిపోతోంది” అని థామస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వ అవినీతికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పార్టీ అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాతమారానని.. మారుతున్నానని చెప్పినా.. థామస్ తన పనితీరు మార్చుకోలేక పోయారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ ప్రమేయం కంటే ఆయన వ్యక్తిగత సహాయకులు, అనుచరుల జోక్యం ఎక్కువ య్యాయనే అసంతృప్తి స్థానిక టీడీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. తాజా ఎన్నికలలో సమన్వయ లోపానికి ఇది కూడా కారణమని అంటున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, ఇప్పటికిప్పుడు జరగకపోయినా.. మరో రెండేళ్లలో అయినా ఆయన మారకపోతే.. మార్పు తప్పకపోవచ్చని అంటున్నారు నాయకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
