మహిళా సెంటిమెంటు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నది తెలిసిందే. అందునా.. రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన మహిళల విషయంలో మరింతగా ప్రజలు ప్రభావితం అవుతారన్నది సందేహం లేని అంశం. ఏపీలో 2024 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వ్యవహారం.. తీవ్రస్థాయిలో కుదిపేసింది. ఆస్తుల నుంచి రాజకీయం వరకు.. తన అన్న చేసిన మోసాన్ని ఆమె పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రచారం చేయడంలో సఫలీకృతం అయ్యారు.
అదే సమయంలో సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును కూడా షర్మిల తెరమీదికి తెచ్చారు. ఫలితంగా జగన్‌కు భారీ సెగతగిలింది. ఇక, మరోవైపు అన్నగా చెల్లెలికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదంటూ.. ప్రతిపక్షాలు సహజంగానే రాజకీయంగా ఈ పరిణామాలను వినియోగించుకున్నాయి. దీంతో వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయింది.
ఇక, ఇప్పటికీ ఈ సోదర సోదరీమణుల రాజకీయం రగులుతూనే ఉంది. ఇటీవల తన కుమార్తె వివాహానికి బెంగళూరు ప్యాలెస్ ఇవ్వలేదని.. షర్మిల చెప్పడం.. ఇవ్వనని జగన్ భీష్మించడం కూడా.. సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు జరగడంతో ప్రజలపై ప్రభావం చూపింది. ఇది రాజకీయ ప్రత్యర్థులకు అందివచ్చిన వరంగా మారి.. జగన్ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నష్టపోయారు.
సీఎం చంద్రబాబు చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి రాష్టాన్ని ఎలా ఉద్ధరిస్తాడంటూ ఇటీవల జగన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఒకపక్క వివేకా కుమార్తె సునీత కోర్టుల చుట్టూ తిరగడం, ఇంకోపక్క షర్మిలతో ఆస్తి తగాదాలు పెట్టుకుంటూ ఒక అన్నగా.. సొంత మేనకోడలు పెళ్ళికి అడ్డు చెప్తూ మేన మామగా.. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన సీఎంగా కూడా ఫెయిల్ అయ్యారని చంద్రబాబు చేసిన వ్యాఖలు జగన్ ను ఇరకాటంలో పడేసిన సంగతి గుర్తు చేసుకోవాల్సిన విషయం.
కట్ చేస్తే.. ఇదే తరహా వివాదం తెలంగాణలోనూ కనిపిస్తోంది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ తనయ కవిత.. సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే.. ఆమెకు కేసీఆర్ కుటుంబం అన్యాయం చేసిందన్న వాదనను ప్రత్యర్థులు బలంగా వినిపిస్తున్నారు. రెండు మాసాల కిందట జరిగిన రాఖీ పండుగ సందర్భంగా.. కవితతో రాఖీ కట్టించుకునేందుకు ఆమె అన్న కేటీఆర్ విముఖత చూపారని.. అమెరికాకు వెళ్లిపోయారన్న ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఇక, పలు సందర్భాల్లో కవిత కూడా.. తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు.
పుట్టిల్లు అంటే.. ప్రజలేనని.. ఒకప్పుడు ఉండేదని ఆమె వరంగల్ సభలోనే తేల్చేశారు. ఇలా.. రగులుతున్న ఈ అన్నా చెల్లెళ్ల మధ్య పోరు.. వ్యక్తిగతంగా వారికి ఏమేరకు లాభిస్తోందో చెప్పలేం కానీ.. పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రత్యర్థి పార్టీలకు ఇవి అంది వచ్చిన వరాలుగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం గమనార్హం.
చెల్లికి ద్రోహం చేసిన దుర్మార్గుడు అంటూ కేటీఆర్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతర్గతంగా మహిళా సెంటిమెంటును కాంగ్రెస్‌కు చేరువ చేసుకోవడంతోపాటు.. కేటీఆర్ సహా బీఆర్ ఎస్‌కు దూరం చేయాలన్న రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపించింది. సో.. మొత్తంగా.. సోదర సోదరీమణుల మధ్య పోరు.. ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారుతుండడం గమనార్హం.
This post was last modified on November 9, 2026 1:06 pm
కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…
"జగన్ ప్రజల ముందుకు వచ్చి ఉంటే.. స్థానిక ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్రశ్న.…
పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం…
దీపావళి పండగ సందర్భంగా వంద కోట్ల బొమ్మగా ప్రచారం చేసుకుని విడుదలైన మూకుతి అమ్మన్ 2 (మహాశక్తి) దారుణంగా బోల్తా…
కొన్ని నెలల క్రితం నెగటివిటీని మోసుకుని టీజర్ ట్రైలర్ టైంలో విమర్శలను చవి చూసిన రామాయణ అంచనాలకు మించి బాక్సాఫీస్…