స్థానిక ఎన్నికల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోవడానికి ఆపార్టీ అధినేత జగనే కారణమని వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో వైసీపీకి పుట్టగతులు కూడా ఉండవని అన్నారు. తనను మానసికంగా వేధించి పార్టీ నుంచి బయటకు పంపేశారని ఆరోపించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తనకు కనీసం విలువ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వైఖరి కారణంగానే తాను బయటకు వచ్చానన్నారు. తనతో పాటు అనేక మంది నాయకులు కూడా మానసికంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ఆ నాడు తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినా చేయలేదన్నారు. వైసీపీ అధిష్టానానికి దమ్ముంటే తనను సస్పెండ్ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నన్ను సస్పెండ్ చేసే ధైర్యం లేక.. చెప్పుడు మాటలతో మానసికంగా వేధించారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయ. వైఎస్ జగన్ ఒంటెత్తు పోకడలు, ఆయన వైఖరితోనే పార్టీ సర్వనాశనం అవుతోంది. అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న మిగిలిన సీనియర్ నేతలు కూడా త్వరలోనే బయటకు వచ్చేస్తారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సమయం కోసమే కొందరు ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఇక, తను ప్రారంభించబోయే పార్టీ.. ఏ పార్టీకీ బీటీమ్ కాదని సాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో తనకు ఎలాంటి రహస్య పొత్తులు లేవని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లోని ప్రజల హక్కుల కోసమే తన సరికొత్త రాజకీయ ప్రయాణమని వెల్లడించారు. ఈ నెల 11న విజయవాడలో జరగబోయే కొత్త పార్టీ జెండా ఆవిర్భావ వేడుకకు లక్షలాది మంది తరలివస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జరిగే మార్పులు అనేకం ఉంటాయని తెలిపారు. తనపైనే కాకుండా.. తన పార్టీపైనా నమ్మకం ఉన్న వేలాది మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సాయిరెడ్డి చెప్పారు.
సాయిరెడ్డి ప్రారంభించబోయే పార్టీ లక్ష్యం.. వచ్చే నేతలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుదనికొందరు అంచనా వేస్తున్నారు. అలానే తటస్థులుగా ఉన్నవారు, మేధావి వర్గం కూడా సాయిరెడ్డి పార్టీలో చేరనున్నారని అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై స్పష్టత అయితే లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టినా.. దాని వెనుక వ్యూహాలు.. పార్టీ స్థాపన లక్ష్యాలు వంటివి కీలకంగా మారనున్నాయి. గతంలోనూ అనేక పార్టీలుపుట్టాయి.. పోయాయి. కానీ, ఎవరూ నిలబడలేక పోయారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ఏమేరకు తన పార్టీని నిలబెడతారన్నది.. నిలదొక్కుకుంటారన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates