సంక్షేమ పథకాలకు ఓటర్ కార్డు ఎందుకు?

సర్ వెనక ఏదో కుట్ర జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలుత రోహింగ్యాల ఓట్లను తొలిగిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న కేంద్రంలోని బీజేపీ పెద్దలు పెద్ద ఎత్తున విపక్షాల ఓట్లను తొలింగించినట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత దొంగ ఓట్లు, అనర్హుల ఓట్లను తొలిగిస్తున్నట్లు కొత్త రాగం అందుకుంది. అది కూడా నిజం కాదని సీజేపీ, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. చివరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడి కార్డును లింక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆధార్ బదులు బయోమెట్రిక్, ఓటర్ ఐడీ ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కేంద్రమంత్రి లలన్‌సింగ్‌ ప్రకటించడం దేశంలో దుమారం రేపుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆధార్ కార్డుకు బదులుగా ఓటర్ ఐడీ కార్డుతో ముడిపెట్టాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఈ మేరకు ఎక్స్ లో మెసేజ్ పోస్టు చేశారు.

కేంద్రమంత్రి లలన్‌సింగ్‌ మాట్లాడిన వీడియోను ఎక్స్ లో ఫార్వార్డ్ చేసిన రాహుల్ బీజేపీ అధికారాన్ని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండే కుట్రలో భాగంగానే ఓటర్ ఐడి కార్డును ప్రయోగిస్తుందని మండిపడ్డారు. సర్ పేరుతో దేశంలోని 13 కోట్ల మంది ఓట్లను తొలిగించారని, ఇప్పుడు బీజేపీకే మెజారిటీ వచ్చేలా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారని చెప్పారు. అదే జాబితా ఆధారంగా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలా వద్దా అనేది
నిర్ణయించబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కనుక అమలులోకి వస్తే భవిష్యత్తులో బీజేపీకి ఓటేసిన వారికే సంక్షేమ పథకాలు అందజేసినా ఆశ్చర్యం లేదన్నారు.

ఓటు అనేది పౌరుల హక్కు అని, తమకు ఇష్టమైన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. తనను వ్యతిరేకించే ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, ఇది మోదీ నియంత్రత్వ వైఖరికి నిదర్శనం అన్నారు. ప్రజల్ని ఓటర్ కార్డుకు బానిసగా మార్చేకుట్రలను తిప్పి కొడతామన్నారు. ఇలాంటి నియంతృత్వ వైఖరితోనే అమెరికాలో ట్రంప్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, ఇక్కడ మనదేశంలోనూ అదే జరగబోతుందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయక తప్పదని, ఆ తర్వాత మోదీ, అమిత్ షా సంగతి చూస్తామని స్పష్టం చేశారు.