ఒకే రోజు… వెంటవెంటనే రెండు యాక్సిడెంట్లు. లక్కీగా ఆ ఎమ్మెల్యే బయటపడ్డారు. తెలంగాణాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఏమైనా కుట్ర దాగివుందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణా ప్రభుత్వ విప్ వేముల వీరేశం గురువారం చిట్యాల మండలం చినకాపర్తి గ్రామంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు తన ఫార్చ్యూనర్ కారులో బయలుదేరారు. కారు కట్టంగూరు మండలం చెరువు అన్నారం సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే ఊహించనిరీతిలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని కారు వెనక నుంచి ఢీ కొట్టింది. ఆ దెబ్బకు కారు ముందు వెళుతున్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొంది. ఆ కుదుపుకు కారు లోపల వున్న ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు . వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే ఎమ్మెల్యేని మరో ఇన్నోవా వాహనంలోకి మార్చి పంపించారు.
ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడిన ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల మండలంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుంగతుర్తి వైపు బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు మరో ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న ఒక లారీ ఎమ్మెల్యే కారును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారుకు ఎడమవైపు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుండి కూడా ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
అయితే వెంట వెంటనే జరిగిన ప్రమాదాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ వరస ప్రమాదాల వెనక ఏదైనా కుట్ర కోణం వుందా అన్న కోణంలో పోలీసు అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే రెండు గండాల నుంచి తమ నాయకుడు క్షేమంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates